మంత్రి, ఎంపీలది ప్రచార ఆర్భాటమే: మహేందర్ రెడ్డి

వేములవాడ: వచ్చిన సంస్థలను కాపాడుకోలేని మంత్రి, ముగ్గురు ఎంపీలు జిల్లాకు ఉండి ఏంలాభమని వైఎస్సార్ సీపీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏంచేయని ప్రజాప్రతినిధులు తెలంగాణ తెస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. సైనిక్ స్కూల్ కోసం స్థలం చూపించకుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు తరలిపోయింది. మొక్కజొన్న కేంద్రం పంజాబ్‌కు, ముర్రాగేదెల పెంపక కేంద్రం మరోరాష్ట్రానికి,చెరుకు, వాతావరణ కేంద్రాలు, పాస్‌పోర్టు కార్యాలయం అతీగతిలేకుండా పోయాయన్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధుల తీరుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి శ్రీధర్‌బాబుకు తండ్రి విగ్రహాలపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదన్నారు. ప్రజలకు సేవలందించాల్సిన ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీ వాస్తవ్యుడయ్యారని, ఇక ఆయన జర్మనీలో ఉండాల్సి వస్తుందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు కుటుంబ, బంధువుల ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి దూరమయ్యాయన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ సానుకూలంగా ఉందన్నారు.

రైతులపై కేసులు ఎత్తేయాలి: ఆది శ్రీనివాస్
విద్యుత్ కోతపై నిరసన తెలుపుతున్న రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని వైఎస్సార్ సీపీ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నేదునూర్ గ్యాస్‌పవర్‌ప్లాంట్ ఏమైందని, కరీంనగర్-తిరుపతి రైలు ఎటు పోయిందని, మిడ్‌మానేరు నిర్వాసితుల పరిహారం ఎందుకు చెల్లించడం లేదని, ఎల్లంపల్లి పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ మార్చ్ నిర్వహించలేరని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయడమేనని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తీగల రవీందర్‌గౌడ్, సుధాకర్‌రావు, ఏశ తిరుపతి, కార్తీక్, వెంకన్న, సంతోష్, మస్తాన్, మహేశ్‌రెడ్డి, ప్రదీప్ పాల్గొన్నారు.

పార్టీలో చేరికలు
సిరిసిల్ల: సిరిసిల్ల ఇందిరానగర్‌కు చెందిన మహిళలు శ్రీరాం రవీందర్, నంది రమేశ్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాలను కేకే మహేందర్‌రెడ్డి కప్పి పార్టీలోకి మహిళలను ఆహ్వానించారు. కార్యక్రమంలో శ్రీరాం రుక్మిణి, దాసరి దేవవ్వ, కుడిక్యాల రుక్మిణి, ఎల్.పద్మ, వసంత, లక్ష్మి, రాజవ్వ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Back to Top