తిరుపతిః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హిందూమత సంప్రదాయాలను మంట కలిపారని భాస్కర్ రెడ్డి విమర్శించారు. అన్న చనిపోతే మైల, అంటు ఉండి కూడా చంద్రబాబు నారావారిపల్లెలో కలశపూజలు చేశారని దుయ్యబట్టారు. మైలతో మనవడికి గుండు కొడితే అరిష్టమని పుట్టి వెంట్రుకలు తీసే కార్యక్రమం వాయిదా వేసుకున్న చంద్రబాబు రాజధానికి గుండు కొడుతున్నారని మండిపడ్డారు. <br/>నారావారిపల్లెలో చంద్రబాబు పెదనాన్న కుమారుడు చనిపోయి ఆరు రోజులయిందని, పెద్ద ఖరమ్మ అయ్యేంతవరకు ఎలాంటి శుభకార్యాలకు వెళ్లకూడదని చెవిరెడ్డి ఈసందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాగదేవతకు పూజలు చేయడం, అర్చకులు చేసిన హోమాల్లో పాల్గొనడంపై మండిపడ్డారు. మైల ఉండి కూడా చంద్రబాబు పూజలు చేయడమే గాకుండా అక్కడ చేసినవన్నీ తీసుకెళ్లి అమరావతి రాజధాని నిర్మాణానికి వాడతానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. <br/>మైల ఉందనే తన మనవడికి పుట్టి వెంట్రుకలు తీసే కార్యక్రమాన్ని చంద్రబాబు వాయిదా వేసుకున్నారన్నారు. మనవడికో సంప్రదాయం.. రాజధాని నిర్మాణానికి మరో సంప్రదాయమా అని చంద్రబాబును నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన శుభ కార్యక్రమాన్ని మైలతో ఎలా నిర్వహిస్తారో చెప్పాలని చంద్రబాబును చెవిరెడ్డి ప్రశ్నించారు.