ఉద్యోగుల సస్పెన్షన్ అన్యాయం

    • చంద్రబాబు నియంతృత్వ ధోరణి 

  • 50ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపాలని  కుట్ర
  • బయటకు పొక్కడంతో అన్యాయంగా ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ 
  • ఎన్జీవో నాయకులు ఉద్యోగుల సస్పెన్షన్ పై గళం విప్పాలి
  • ఉద్యోగుల సస్పెన్షన్ ను ఖండిస్తున్నాం..తక్షణమే విత్ డ్రా చేసుకోవాలి
  • వైయస్సార్సీపీ నేత మల్లాది విష్ణు
విజయవాడః సెక్రటేరియట్ లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ చంద్రబాబు నియంతృత్వ ధోరణికి నిదర్శనమని వైయస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. వారు ఏమి తప్పు చేశారని తొలగించారని ప్రశ్నించారు. బాబు పాలనలో ఉద్యోగస్తులపై వేధింపులు ఎక్కువయ్యాయని మల్లాది ధ్వజమెత్తారు. నేను మారాను, నన్నునమ్మండి అని చెప్పి మళ్లీ బాబు పాత విధానాలనే కొనసాగిస్తున్నారని విష్ణు ధ్వజమెత్తారు.  ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు శరాఘాతంగా మారుతుందన్నారు. 50 ఏళ్లకే ఉద్యోగులను ఇంటింకి పంపాలని చంద్రబాబు ప్లాన్ వేశారని, అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ జీవో బయటకు పొక్కడంతో కంగారుపడిపోయి ఆ ప్రతిపాదన ఏమీ లేదని చెప్పుకొచ్చారన్నారు. అలాంటి జీవో ఏమీ లేనప్పుడు మరి ఇద్దరు ఉద్యోగస్తులను ఎందుకు సస్పెండ్ చేసిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.  చెల్లప్ప, వెంకట్రామిరెడ్డి అనే ఉద్యోగస్తులను ప్రభుత్వం తొలగించడం అన్యాయమన్నారు.  రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరూ వారికి అండగా నిలిచి, ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించాలన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి మల్లాది విష్ణు మాట్లాడారు.  టీడీపీ ప్రభుత్వం పరిపాలనకు సంబంధించిన జీవోలను చీకట్లో పెడుతోందని మల్లాది మండిపడ్డారు.  ఈవీఎంల ట్యాంపరింగ్ దుస్సంఘటనకు పాల్పడిన వ్యక్తిని బాబు ఏవిధంగా ఐటీ సలహాదారులుగా పెట్టుకున్నారో అందరికీ తెలుసునన్నారు. 

చంద్రబాబు పరిపాలన చూసి రాష్ట్రంలో ఉద్యోగస్తులు ముక్కున వేలేసుకుంటున్నారని మల్లాది అన్నారు.  రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు,  ఎన్జీవో నాయకులు ఇద్దరు ఉద్యోగస్తుల సస్పెన్షన్ పై గళం విప్పాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వో, ఏపీఎస్ ల మీద టీడీపీ నేతలు దాడి చేసినప్పుడు ఉదాసీనత వైఖరి అవలంభించడం వల్లే ఇవాళ సెక్రటేరియట్  లో పనిచేసేవారిపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. తిరుపతిలో జరగనున్న ఎన్జీవోలకు సంబంధించిన కౌన్సిల్ లో ఉద్యోగస్తుల సస్పెన్షన్ ను ఖండించాలన్నారు. రాష్ట్రంలో 88 ఏళ్లు ఉద్యోగాలు చేయాల్సిన వారిని 50 ఏళ్లకే వేటు వేయాలని టీడీపీ కుట్ర చేస్తోందన్నారు.  ఆ డ్రాఫ్ట్ బయటకు రాబట్టే ఇవాళ అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారన్న సంగతి ఉద్యోగస్తులు తెలుసుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కేంద్ర సర్వీసుల్లోకి ఎందుకు మారుతున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. భన్వర్ లాల్ ఉద్యోగవిరమణ చేశాక ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు.  సెక్రటేరియట్ లో ధర్మానికి కట్టుబడిన ఉద్యోగస్తులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం ఉద్యోగస్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని మల్లాది అన్నారు. 11నెలల పీఆర్సీకి సంబంధించిన ఎరియర్స్ పెండింగ్ లో ఉన్నాయని, ఉద్యోగస్తులకు బాబు న్యాయం చేయలేకపోయారని దుయ్యబట్టారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సస్పెన్షన్ విధానాన్ని వైయస్సార్సీపీ ఖండిస్తోందన్నారు. సస్పెన్షన్ విత్ డ్రా చేసుకోకపోతే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగుల భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. 
Back to Top