ప్రాజెక్ట్ ల పేరిట కేసీఆర్ దందాలు

కోటి ఎకరాలకు నీరు ఉత్తమాటే
ప్రాజెక్ట్ ల పేరు చెప్పి కమీషన్ల దందాలు
కేసీఆర్ పై కొండా ఫైర్
ప్రాజెక్ట్ లు అంటేనే గుర్తుకొచ్చేది వైఎస్సార్
పెండింగ్ ప్రాజెక్ట్ లన్నీ పూర్తిచేయాలిః కొండా

హైదరాబాద్ః తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి కొండ రాఘ‌వ‌రెడ్డి టీఆర్ఎస్ పై మండిపడ్డారు.  కేసీఆర్ ప్రాజెక్టుల పేరిట క‌మీష‌న్ల దందాను కొన‌సాగిస్తున్నార‌ని విమర్శించారు. దోపిడీ మానుకోవాలని హితవు పలికారు. పాల‌మూరులో ఉన్న‌ 4 ప్రాజెక్టుల‌కు సుమారు రూ. 7 వంద‌ల కోట్లు ఇస్తే ఎన్నిమిదిన్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు వ‌స్తాయ‌న్నారు. దాన్ని విస్మరించి ప్రాజెక్ట్ రీడిజైన్ ల పేరిట కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్ ల నిర్మాణం పూర్తి చేస్తే...ఆయన పేరు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందనే ప్రాజెక్ట్ లు, రీడిజైన్ లంటూ కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఫైరయ్యారు. 

తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని తీర్మానాలు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్ట్ లన్నంటినికీ 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చి సత్వరమే పూర్తి చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్క‌డ ఏ ఎమ్మెల్యే చ‌నిపోయినా ఆ ఎమ్మెల్యే ప‌ద‌వి వారి కుటుంబ స‌భ్యుల‌కు ఇవ్వాల‌ని దివంగ‌త మ‌హానేత రాజ‌శేఖ‌ర‌రెడ్డి చెప్పార‌ని రాఘవరెడ్డి గుర్తు చేశారు. అందుకోసం పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుచ‌రిత త‌ర‌ఫున వైసీపీ రాష్ట్ర నాయ‌కులు  ఆమెకు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తారని చెప్పారు. టీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనమైందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ ఇంకో తీర్మానం చేసినట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. తమ పార్టీ వేరే ఏ పార్టీలోనూ విలీనం కాలేదని ఆయన స్పష్టం చేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి - ఫారంపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామా చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.   తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రద్దు అయినట్లు ఆయన తెలిపారు. నూతన అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారిపై పార్లమెంట్, అసెంబ్లీలో స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. త‌క్ష‌ణ‌మే అన్ని మండ‌లాల‌ను ప్రభుత్వం క‌రువు మండ‌లాలుగా ప్ర‌క‌టించాల‌న్నారు. అదేవిధంగా ప‌శుగ్రాపాన్ని ఇత‌ర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తెలంగాణ రైతుల‌కు ఉచితంగా పంపిణీ చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. 2019 నాటికి నిర్ణయాత్మక శక్తిగా మారుతామని రాఘవరెడ్డి స్పష్టం చేశారు. 

ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు చేస్తున్న కేసీఆర్ ముందుగా  దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలన్నారు. మహబూబ్ నగర్ లోని ఆ నాలుగు  ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. మహానేత ప్రారంభించిన 36 ప్రాజెక్టుల‌లో ఆరు ప్రాజెక్టులు పూర్తై 6 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందుతుందన్నారు. 21 ప్రాజెక్టులు పాక్షికంగా, 9 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న‌ట్టువంటి ప‌రిస్థితుల్లో అన్ని ప్రాజెక్టుల‌కు రూ. 10వేల కోట్ల ఇవ్వ‌గ‌లిగితే... 40 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరోచ్చే ప‌రిస్థితి ఉంటుదన్నారు. దాన్ని ప‌క్క‌న పెట్టి కోటి ఎక‌రాల‌కు నీరందిస్తున్నానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దీక్షకు తెలంగాణ వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కొండా ప్రకటించారు. 

18నెల‌లుగా పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి నాయ‌క‌త్వంలో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా న‌ష్ట‌పోయింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. పార్టీ మార‌డం లేద‌ని విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి చెప్పిన శ్రీ‌నివాస్‌రెడ్డి...బేరం కుద‌ర‌గానే పార్టీ మారార‌ని ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన మాటలన్నీ గారడీలేనని దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూంలు అన్నారు. వాటి ఊసేలేదని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి -డిండి ప్రాజెక్ట్ ల పేరుతో జిల్లాల మధ్య పంచాయతీ పెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. 


Back to Top