ఎమ్మెల్యే చెవిరెడ్డి మాకు స్ఫూర్తి

చిత్తూరు: ఏ కార్య‌క్ర‌మం తలపెట్టినా ఒక యజ్ఞంగా పూర్తిచేసే చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయాల్లో మాలాంటి వారికి స్ఫూర్తిప్రధాత అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కొనియాడారు. పల్లెలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వేలాది మందితో వైయ‌స్ఆర్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ నెల 4వ తేది నుంచి నిర్వహించనున్న వైయ‌స్ఆర్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన ట్రోఫిలు, కప్‌లు, సర్టిఫికెట్లు, పతకాలను తుమ్మలగుంటలోని డాక్టర్ వైయ‌స్ఆర్ గ్రౌండ్‌లో గురువారం ఎంపీ మిథున్‌రెడ్డి ఆవిష్కరించారు. మొదటి బహుమతిగా ఏడు అడుగల ట్రోఫీతో పాటు లక్ష రూపాయల నగదు, రెండో బహుమతి ఆరు ఆడుగుల ట్రోఫీతో పాటు రూ.50వేలు, మూడో బహుమతి రూ.25వేల నగదు, ట్రోఫీ, నాల్గవ బహుమతి రూ.10వేలు, ట్రోఫీలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇచ్చేందుకు తెచ్చిన వేలాది బహుమతులను చూసి ఆయన ఆశ్చర్యభరితులు అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఒకసారి గెలిచాక ఐదేళ్ల వరకు ప్రజలను పట్టించుకొని నాయకులు ఉన్న ఈ రోజుల్లో ప్రతి నిత్యం ప్రజల కోసం తపిస్తూ, యువతను ప్రోత్సాహిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి నిజంగా ప్రజానేత అని కొనియాడారు. పల్లెలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఆయన తపిస్తున్న తీరు అభినందనీయమన్నారు. క్రీడలను ప్రోత్సాహిస్తామని ప్రకటనలకే పరిమితం అయిన ప్రభుత్వం, పల్లె ప్రతిభను ప్రోత్సాహిస్తున్న చెవిరెడ్డిని చూసి సిగ్గుతెచ్చుకోవాలని హితవు పలికారు.

4,300 మంది నమోదు..
వైయ‌స్ఆర్‌ గ్రామీణ క్రికెట టోర్నమెంట్‌కు నియోజకవర్గంలోని అన్ని పల్లెల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందని టోర్నమెంట్‌ నిర్వాహకులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 4,300 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వారిని 240 జట్టులుగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనిమిది పూల్స్‌లో ఈ జట్లు తలపడతాయని, అందుకోసం తుమ్మలగుంటలోని వైయ‌స్ఆర్ క్రీడామైదనంలో టోర్నమెంట్‌ కోసం మొత్తం 10 గ్రౌండ్స్‌ను సిద్ధం చేశామన్నారు. ప్రతి రోజు 30 మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. మొత్తం 16 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో సుశిక్షుతులైన 36 మంది అంపైర్స్‌ను హైదరాబాదు నుంచి రప్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో క్రీడా నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పిన మహానుభావుడు వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో, ఆయన జ్ఞాపకార్ధం ప్రతి ఏటా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ చిన్ని, వైయ‌స్ఆర్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు చొక్కారెడ్డి జగధీశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, పార్టీ రాష్ట్ర నాయకులు మునస్వామియాదవ్, లోకనాధరెడ్డి, శ్రీరాములు, మస్తాన్, మూలం బాబు, బుజ్జిరెడ్డి, చిన్నియాదవ్, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, సునీల్, సీకాం విద్యా సంస్థల చైర్మన్‌ సురేంద్రరెడ్డి, ఎస్వీ ఢీఫెన్స్‌ అకాడమి కరస్పాండెంట్‌ శేషారెడ్డి, రూరల్‌ మండల కో–ఆష్షన్‌ సభ్యుడు ఓటేరు బాషా పాల్గొన్నారు.

Back to Top