24న మహాధర్నాను విజయవంతం చేయాలి

  • ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నిర్వీర్యం
  • టీఆర్ఎస్ పాలన తీరుపై వైయస్సార్సీపీ ఆగ్రహం
  • విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన
  • 24న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా
  • టీ వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిప్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తెలంగాణ సర్కార్‌ నిర్వీర్యం చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా తలపెట్టినట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ వస్తే నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయని 14 సంవత్సరాలు ఉద్యమం చేసి కళ్లబొల్లి మాటలు చెప్పిన కేసీఆర్‌ మాటతప్పారని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తామన్న వ్యక్తి ఆ మాట నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. 2016 మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి బకాయిలు 2016, ఏప్రిల్‌లో చెల్లిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఏడాది గడుస్తున్న ఆ అబద్ధం అబద్ధంగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. 2014కు ముందుకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1880 కోట్లు ఉండేవన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో లోటు బడ్జెట్‌ కారణంగా అంత బకాయిలు పెడితే..ఇవాళ ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ, మనకు లోటన్నదే లేదని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ రూ.3600 కోట్ల బకాయిలు ఉన్న సంగతి మరిచారని విమర్శించారు. 

తెలంగాణ సర్కార్‌ తీరుపై  అ మహాధర్నా ఆరంభం మాత్రమే..అంతం కాదని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మానస పుత్రిక లాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మహాధర్నాలో వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నట్లు కొండా రాఘవరెడ్డి వెల్లడించారు.
 
Back to Top