ఘోర రోడ్డు ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి

హైద‌రాబాద్‌: తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగిన గండేపల్లికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రయాణం అయ్యారు. ఘటనాస్థలాన్ని పరిశీలించటంతో పాటు గా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఆయన పరామర్శించనున్నారు. ఈ ఘటనపై  వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.మృతుల కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని కోరారు. 

పిడుగురాళ్ల నుంచి వెళుతున్న లారీ తూ.గో.జిల్లా గండేప‌ల్లి ద‌గ్గ‌ర అదుపు త‌ప్పి బోల్తా కొట్టింది. ఇందులో దాదాపు 15 మందికి పైగా మ‌ర‌ణించిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం. మృతుల పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. 15 మందికి పైగా గాయాల‌తో బ‌య‌ట ప‌డ్డారు.

ప్రమాదం గురించి తెలియగానే వైెఎస్సార్సీపీ అగ్ర నేత, పార్టీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. పార్టీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ టెలిఫోన్ లో నెహ్రూ తో మాట్లాడారు. సమాచారం తెలుసుకొన్నారు. ప్రమాద బాధితులకు అందించాల్సిన సమాయ చర్యల గురించి మాట్లాడారు. 

తూ.గో. జిల్లాకు చెందిన వ‌ల‌స కూలీలు పశ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు ద‌గ్గ‌ర ఈ లారీ ఎక్కారు. తెల్ల‌వారు జాము స‌మ‌యం కావ‌టంతో డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తులోకి జారిన‌ట్లు తెలుస్తోంది. నిద్ర‌మ‌త్తులోనే జాతీయ ర‌హ‌దారి మీద నుంచి ప‌క్క నున్న పొలాల్లోకి లారీ దూసుకెళ్లింది. దీంతో ప్ర‌మాదం చోటు చేసుకొంద‌ని అంటున్నారు. 
Back to Top