'వైయస్ఆర్‌ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు'

న్యూఢిల్లీ, 27 ఆగస్టు 2013:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు వచ్చి ఉండేవి కావని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలన్న తమ డిమాండ్‌ను పరిశీలిస్తామని ఆయన తమ పార్టీ బృందానికి హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారంనాడు ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది.

ఈ రాష్ట్రం సమైక్యంగా లేకపోతే.. సిడబ్ల్యుసి నిర్ణయాన్నే అమలు చేయాలనుకుంటే.. పరిష్కారం కాని చాలా సమస్యలు ఉన్నాయని మైసూరారెడ్డి అన్నారు. అవి పరిష్కారం కానప్పుడు అందరికీ న్యాయం జరగదన్నారు. అలాంటప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచడం మంచిదని తాము ప్రధానికి చెప్పామన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించడానికి మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని చెప్పారన్నారు. పార్టీ బృందం ఇచ్చిన మెమొరాండంలోని అన్ని విషయాలనూ కూలంకషంగా పరిశీలిస్తామన్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని మైసూరారెడ్డి తెలిపారు. ఆయన ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికీ లబ్ధి చేకూర్చారన్నారు. రాజకీయ నిరుద్యోగులు చేసినదే విభజన ఉద్యమం అన్నారు.

Back to Top