గుంటూరు : ముస్లిం మైనార్టీల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎనలేని కృషి చేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నగర మైనార్టీ విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి మైనార్టీ విభాగం నగర కన్వీనర్ మార్కెట్‌బాబు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు 4.5 రిజర్వేషన్ కల్పించిన ఘనత మహానేత వైయస్‌కు మాత్రమే దక్కుతుందని కొనియాడారు. టిడిపి హయాంలో మైనార్టీల అభివృద్ధికి కేవలం రూ.30 కోట్లు కేటాయిస్తే, మహానేత వైయస్‌ఆర్ సి.ఎం. అవగానే రూ.285 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా ముస్లింలు నమ్మే పరిస్ధితుల్లో లేరన్నారు. చంద్రబాబు పాదయాత్ర వీధినాటకాన్ని తలపిస్తోందని ఎద్దేవా చేశారు.
వైయస్‌ఆర్ పుణ్యమా అని ముస్లిం విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు స్కాలర్‌షిప్పులు పొంది ఉన్నత విద్య చదువుకోగలిగారని పార్టీ యువజన విభాగం నగర కన్వీనర్ ఎం.డి. నసీర్ అహ్మద్ అన్నారు. ముస్లింలకు రూ.182 కోట్ల రుణాలను మహానేత మాఫీ చేశారన్నారు. పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ చాంద్‌బాషా మాట్లాడుతూ, వైయస్‌ఆర్ మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన పథకాలను కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నీరుగారుస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కు రాజకీయాలతో శ్రీ జగన్‌ను జైలుకు పంపినా, ప్రజల ఆశీర్వాదాలతో త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు.
మతతత్వ పార్టీ బిజెపితో చంద్రబాబు గతంలో జోడీ కట్టిన వైనాన్ని పార్టీ నాయకుడు మొహమ్మద్ ముస్తాఫా గుర్తుచేశారు. సభకు అధ్యక్షత వహించిన మార్కెట్‌బాబు మాట్లాడుతూ, పార్టీ అధినేత శ్రీ జగగన్న ముఖ్యమంత్రి అవడం ద్వారానే మైనార్టీలకు తగిన ప్రాధాన్యం లభిస్తుందన్నారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర జయప్రదం చేయాలని కోరుతూ మైనార్టీ విభాగం నగర కన్వీనర్ మార్కెట్‌బాబు ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు.