ప్రత్యేకహోదాయే ప్రధాన ఎజెండా

  • బాబు, మోడీలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు
  • వైయస్ జగన్ హోదా కోసం ఎంతగానో పరితపిస్తున్నారు
  • గల్లీ నుంచి ఢిల్లీదాక పోరాడారు
  • పార్లమెంట్ లో హోదా కోసం పట్టుబడతాం
  • ఎంవోయూ అంతా ఓ బూటకం
  • హోదా సెంటిమెంట్ ను పక్కదారిపట్టించేందుకే..
  • బాబు పెట్టుబడుల నాటకంః వైయస్సార్సీపీ ఎంపీలు
హైదరాబాద్ః రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ ఎంతగానో పరితపిస్తున్నారని వైయస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.  ప్రత్యేకహోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా చంద్రబాబు, మోడీలు...ఇచ్చిన మాటను భంగం చేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీలు హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదానే ప్రధాన అంశంగా చర్చించినట్టు తెలిపారు. ఈసందర్భంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....ఏపీ అభివృద్ధి ఒక్క ప్రత్యేకహోదాతోనే సాధ్యమని, ప్యాకేజీకి విలువే లేదని అన్నారు. హోదా వస్తేనే  ఏపీ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతుందని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పుణ్యమాని ప్రతి పేద బిడ్డ చదువుకొని డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని, హోదా లేకపోవడంతో వారంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హోదా వస్తే అందరికీ ఇక్కడే ఉద్యోగం వస్తుందన్నారు.  

హోదాకు-ప్యాకేజీకి తేడా లేదంటూ కన్వీన్స్ చేసినట్టుగా మాట్లాడుతూ బాబు నవరసాలు పలికిస్తున్నారని, ఆయన భాష చూస్తుంటే ప్రజలను వంచించడం తప్ప మరొకటి లేదని ఎధ్దేవా చేశారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల హక్కుల్ని బాబు, మోడీ కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ చేయని పోరాటం లేదని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్రమంత్రులను కలిసారు. ఢిల్లీలో ధర్నా, రాష్ట్రంలో బంద్ లు, నిరసన దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు . విశాఖలో క్యాండిల్ ర్యాలీకి వెళ్లిన ప్రతిపక్ష నేతను విమానం దిగి దిగకముందే అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించడం దారుణమన్నారు. వాస్తవాలు చెప్పకుండా బాబును సపోర్ట్ చేసే పత్రికలు వక్రీకరించి చెబుతున్నాయని మేకపాటి ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ పాలనలో ఏపీ అన్ని రకాలుగా నష్టపోయిందని, ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలోని హామీల కోసం పార్లమెంట్ లో గట్టిగా పోరాడుతామని చెప్పారు. 

వరప్రసాద్
స్పెషల్ ప్యాకేజీలో ఎంత డబ్బు వచ్చింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెబితే బాగుంటుంది తప్ప...హోదా కన్నా ప్యాకేజీతోనే మేలని చంద్రబాబు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని తిరుపతి ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ప్యాకేజీలో వచ్చే డబ్బులు సీఎం అకౌంట్ లోకి వెళితే చంద్రన్న కానుక, చంద్రన్న బాట అని వాళ్లు ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకుంటారు తప్ప అవి ప్రజలకు ఉపయోగపడవని స్పష్టం చేశారు. ప్యాకేజీతో అభివృద్ధికి అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఎంవోయూలు అంతా బూటకమని వరప్రసాద్ కొట్టిపారేశారు. 21లక్షలు ఉద్యోగాలొస్తాయని చెప్పారు. ఏ బేసిస్ మీద వస్తాయో తెలియదు. గతంలో ఇదే మాదిరి చెప్పారు. ఒక్క ఉద్యోగం కూడా రాలేదని అన్నారు. హోదాతేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశిస్తే తామంతా రాజీనామాకు సిద్ధమని చెప్పారు.  

వైవి సుబ్బారెడ్డి
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి పక్కన తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కూడా హోదాకు మద్దతు తెలుపుతున్నారని, కానీ టీడీపీ ఎంపీలకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ వాళ్లను చూసైనా టీడీపీ ఎంపీలు  పునరాలోచించుకోవాలన్నారు. ప్రత్యేకహోదా పోరాటానికి ఇప్పటికైనా తమతో కలిసి రావాలని సూచించారు.  పార్లమెంట్ లో హోదా కోసం లోగడ చేసినవిధంగానే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ఓటింగ్ పెట్టే సందర్భంగా మిగతా పార్టీలతో మాడి హోదాపై స్పష్టత ఇవ్వాలని కోరతామన్నారు. గత సమావేశాల్లోనే హోదాపై  ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని అది ఇప్పుడు చర్చకు వస్తుందని భావిస్తున్నామని వైవి అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో యాంటీ డిఫెక్షన్ బిల్లు కూడ ప్రవేశపెడతామని చెప్పారు. 

మిథున్ రెడ్డి
నిన్నటి విశాఖ సదస్సులో 2లక్షల కోట్లు పెట్టుబడులొచ్చాయని బాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించేదేమీ లేదని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.  గత సంవత్సరం కూడా 4లక్షల కోట్లు వచ్చాయని ఇదే మాదిరి చెప్పి మోసం చేశారన్నారు. ఏదైనా  పరిశ్రమ పెట్టేటప్పుడు ఢిల్లీలో డీఐపీపీలో అప్లై చేస్తారని, అందులో వీళ్లు చేసింది కేవలం 30 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే 4, 5వేల కోట్ల కన్నా ఎక్కువ రాలేదన్నారు. ఎంవోయూ అంతా ఓ బోగస్ అని విమర్శించారు. హోదా సెంటిమెంట్ ను పక్కదారి పట్టించేందుకే లక్షల కోట్లు పెట్టుబడులు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. 
Back to Top