మహిళలను మభ్యపెట్టేందుకే బంగారు తల్లి

హైదరాబాద్, 30 ఏప్రిల్ 2013:

మహిళలను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి బంగారు తల్లి పథకాన్ని ప్రకటించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించడం మాని కొత్త పథకాలు ఎందుకు ప్రవేశపెడతారని ఆమె ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళల కోసం దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బంగారు తల్లీ బూచాళ్ళం వచ్చాం అని సీఎం చేస్తున్న ప్రకటనలలో చేరిస్తే బాగుంటుందన్నారు. ఆయన చేస్తున్న పనులకు ఇది సరిపోతుందన్నారు.  చిన్నారులను ప్రస్తుతం చాక్లెట్లు, మరోటో ఇచ్చి మోసం చేస్తున్న చందంగానే ముఖ్యమంత్రి పథకాలున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చేతగానితనం ఆయన పథకాలకు పెడుతున్న పేర్లలో ప్రతిఫలిస్తోందన్నారు.

మూడేళ్ళుగా ఈ రాష్ట్రంలో ఆడవారు పడుతున్న కష్టాలపై మీలో చలనం ఉందా అని ఆమె ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఎన్నికలు రాబోతున్నాయి కనుక మహిళలను మంచి చేసుకునేందుకు చెబుతున్న కల్లబొల్లి కబుర్లే ఈ బంగారు తల్లి పథకమన్నారు. ఆడపిల్లల్ని అలా పిలవాలనే మంచి మనసే ఉంటే ఈ నాలుగేళ్ళూ మీరేం చేశారని పద్మ నిలదీశారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణానంతరం మహిళా సంక్షేమానికి సంబంధించిన పథకాలకు తూట్లు పొడిచిందని ఆరోపించారు. మహిళలపై భారం మోపింది మినహా వారికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్నీ చేపట్టలేదని ఆమె స్పష్టంచేశారు. ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ చెబుతున్న  కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. కోతల రాయుడు అవతారం ఎత్తారని స్పష్టమవుతుందన్నారు.  శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్రకు మహిళలు గ్రామాలకు గ్రామాలు తరలి వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. తామెలా బతకాలని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా కరెంటు సంక్షోభాన్ని ప్రస్తావిస్తున్నారన్నారు. 32 వేల కోట్ల రూపాయలను సర్చార్జి రూపంలో భారం వేస్తున్నప్పటికి ఇంట్లో గుడ్డి దీపం కూడా లేకుండా ఆర్పుతున్నారని తెలిపారు.

బంగారు తల్లి, మరో తల్లి అని ముఖ్యమంత్రి మాట్లాడడం పిట్టల దొరను గుర్తు తెస్తోందని పద్మ చెప్పారు.  తాగునీరివ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. గ్రామాలలో మంచి నీటి ఇక్కట్లు తీర్చడానికి వీలుగా మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఏర్పాట్లు చేసి అప్పగిస్తే వాటిని పనిచేసేలా చేయించడానికి ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జిల్లాలో చూసిన ఇలాంటి ప్రాజెక్టులు నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. ఒక బిందె నీరివ్వలేని మీరు బంగారు తల్లి అని ఎలా పిలవగలుగుతున్నారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మహిళలు అడుగుతున్నది ముఖ్యమంత్రి కుర్చీ గానీ, మీ క్యాబినెట్‌లోని మహిళా మంత్రుల కుర్చీలు గానీ అడగడం లేదనీ, కేవలం బిందె నీళ్ళేనని చెప్పారు.

కరెంటు నుంచి సాగునీరు వరకూ అన్నీ ఇక్కట్లేనన్నారు. అన్ని కుటుంబాలలో మహిళలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బిందెలతో నీళ్ళు తెచ్చుకుని పొలాలను తడుపుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. ఎకరం భూమి తడపడానికి కూడా కరెంటు ఇవ్వడం లేదన్నారు. ఒక్క గంట కరెంటు ఇవ్వలేని మీరు మహిళలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బంగారు తల్లి, అమృత హస్తం అనే ఈ పథకాలేమటని ప్రశ్నించారు. బంగారు నాణేలు పంచుకుంటూ తిరిగినా కూడా మహిళలు మిమ్మల్ని పట్టించుకోరని ఆమె స్పష్టంచేశారు. చంద్రబాబు అడుగుజాడలలోనే ప్రస్తుత పాలన కొనసాగుతోందని గ్రామాలలో బాహాటంగానే చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలలకు వెడితే టాయిలెట్లు కూడా లేవన్నారు. అసలు రూపాన్ని దాచిపెట్టి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారనీ, దీనిపై నిలదీయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దనీ తెలిపారు. ఆడవారికి సంబంధించి ఉపయోగపడే ఏ పథకాన్నీ కొనసాగించకుండా కొత్త పథకాలేమిటని ఆమె నిలదీశారు. అబద్ధాలతో ఎంతకాలం కొనసాగాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారూ అని ప్రశ్నించారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు, బియ్యాన్ని 30 కేజీలకు పెంచుతామన్న రాజశేఖరరెడ్డి గారి రెండు ముఖ్య హామీలను తుంగలో తొక్కారన్నారు. వీటిని పక్కన పెట్టి ఆర్భాటపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారన్నారు.

మాటలు చెప్పడానికి ఇంత ప్రయాస పడడమెందుకని పద్మ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మీకున్న కుర్చీని ఉపయోగించి ప్రజల కనీస అవసరాలు తీర్చలేరా అని అడిగారు. ప్రజల గురించి కొంత కూడా ఆలోచించడం లేదన్నారు. ఆ కుర్చీలు ఎలా కూర్చోవాలీ, ప్రకటనలు ఎలా చేసుకోవాలీ అనే యావ తప్ప వేరేది లేకపోయిందన్నారు. అమ్మహస్తం పేరుతో ఇచ్చే సరకులలో 20  లేదా 30  రూపాయల లాభాన్ని చూపించి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారిని ప్రజల గుండెల్లోంచి చెరిపేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా దుర్మార్గమైన విషయమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందనీ, అబద్ధాలలో పరిపాలన సాగిస్తోందనీ ఆమె ధ్వజమెత్తారు. కుట్రలు, కుమ్మక్కులతో పైచేయి సాధించాలని చూస్తున్నారని చెప్పారు. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 108, 104లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. డిగ్రీ దాక చదివిస్తామని ఇప్పుడు గొప్పగా చెబుతున్నారనీ, ఫీజు రీయింబర్సుమెంటు సక్రమంగా అందక కొందరి చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిని విడిచి  బంగారు తల్లి అంటూ కొత్త పథకం తెస్తున్నామంటే ప్రజలు నమ్మరని పద్మ స్పష్టంచేశారు.

మహిళలకు బతుకుపై భరోసా లేని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంది తప్ప మహిళల గురించి పట్టించుకోవడం లేదన్నారు. అన్ని రంగాల్లో ధరలు పెరిగాయన్నారు. బంగారు తల్లీ మావి రాతి గుండెలని చెప్పుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు.  చంద్రబాబు ఎలాగైతే మెండిచేయి చూపినట్టుగానే ముఖ్యమంత్రికూడా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దివంగత మహానేత అందరి కష్టాలు చూసి, పథకాలు రూపొందించారన్నారు. ఆయన ప్రభుత్వ ఖజానా నిండిందా లేదా అని కాకుండా పేదవాని కడుపు నిండిదా లేదా అని చూశారని పేర్కొన్నారు. చెప్పని పనులను కూడా రాజశేఖరరెడ్డిగారు చేసి చూపించారని ఆమె గుర్తుచేశారు. ఇచ్చిన వాగ్దానాలనూ, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన అంశాలనూ  ప్రస్తుత ప్రభుత్వం అమలుచేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఖజానా నిండిందా లేదా అని కాకుండా పేదవాని గురించి ఆలోచించండని ఆమె ముఖ్యమంత్రికి సూచించారు. మహిళల జీవితాలను దుర్భరం చేయవద్దని విజ్ఞప్తిచేశారు. ఎన్నికలొస్తున్నాయనే ఆలోచనతో ఆకర్షణీయ పథకాలను రూపొందించవద్దని కోరారు.

Back to Top