మహిళలకు రక్షణ లేదు: షర్మిల

గుంటూరు 08 మార్చి 2013:

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని శ్రీమతి వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. మహిళ గర్వంగా తలెత్తుకునే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని ఆమె వ్యాఖ్యానించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గుంటూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆమె యాత్ర 85వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఆమె తుబాడ ఎస్సీ కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ మహిళలకు మరుగుదొడ్లు కట్టిస్తామని చెప్పి, కాంగ్రెస్ పెద్దలే ఆ డబ్బులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. మహిళల విషయంలో చంద్రబాబు అదే వైఖరి అనుసరించేవారన్నారు. రంగారెడ్డి జిల్లాలో యాసిడ్ దాడికి గురైన యువతి విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుకు కోర్టు అక్షింతలు కూడా వేసిందన్నారు. అయినా బాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పాదయాత్రలో భాగంగా షర్మిల తుబాడులో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.

Back to Top