'మహానగరంలో పెద్ద మాయగాడు చంద్రబాబు'

హైదరాబాద్ :

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెద్ద మాయగాడు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రజలకు మేలు జరిగే పనులేవీ చేయని ఆయన ఇపుడు చేస్తానని ప్రజలను మభ్యపెట్టేందు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన వైయస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూ‌ర్ యూనియ‌న్ తొలి మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

తొమ్మిదేళ్ల పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించే అధికారాన్ని ప్రజలు చంద్రబాబుకు ఇచ్చారని, కానీ ఆయన ప్రజలకు పనికొచ్చే ఒక్క సంక్షేమ పథకమూ చేపట్టలేదని మేకపాటి ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల ‌పాలనాకాలంలో పెద్ద ఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాభిమానం సంపాదించుకున్నారన్నారు. ఒక కాంగ్రెస్ ‌సిఎంగా వైయస్ ఒక పథకం చేపట్టాలంటే.. ఆయనకు హైకమాండ్, లో‌ కమాండ్ అంటూ అడ్డంకులు‌ ఉండేవి అన్నారు. కానీ చంద్రబాబుకు ఆ సమస్యలు లేవన్నారు. అన్నీ తానే అయినందున ఎలాంటి పని చేసినా వద్దనే వారే ఆ రోజు లేరు అని మేకపాటి గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఎన్నికలొస్తే 75 శాతం మంది ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి వెంటే ఉంటారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమాగా చెప్పారు. వైయస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూ‌ర్ యూనియ‌న్‌లో లక్ష మంది సభ్యులను చేర్పించాలని ఈ సందర్భంగా ఆయన కార్మికులకు సూచించారు.

పులి కడుపున పులిబిడ్డే: కొణతాల
పులి కడుపున పులిబిడ్డే పుడుతుందని, అలాంటి వ్యక్తి‌ శ్రీ వైయస్ జగ‌న్ అని‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. మహానేత వైయస్‌ఆర్ ‌పెట్టిన పథకాల అమలు శ్రీ జగన్ వల్లనే సాధ్యమ‌ని ఆయన అన్నారు. శ్రీ జగన్ రాక‌ కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఆయనను ఎప్పుడెప్పుడు సిఎంను చేయాలా అని ఆలోచిస్తున్నారని కొణతాల పేర్కొన్నారు. సిఎం కిరణ్, చంద్రబాబు ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివా‌రని, ఇద్దరి విధానాలు ఒకటేనన్నారు.

ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని కొణతాల స్పష్టంచేశారు. ఆర్టీసీ పట్ల‌ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉదారంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆర్టీసీని ఏనాడూ ఆయన వ్యాపారదృష్టితో చూడలేదన్నారు.

సంస్థలను ముంచడంలో బాబు రూటే వేరు:
ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు తాము ఎన్ని సూచనలు చేసినా అప్పటి సిఎం చంద్రబాబు పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ఆరోపించారు. తాను ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఎన్నెన్నో సూచనలు చేసినట్లు వెల్లడించారు. లాభాల్లో నడిచే ఏ సంస్థనైనా ప్రైవేటు పరం చేయాలంటే.. అది నష్టాల్లో కూరుకుపోయేలా చంద్రబాబు ఒక పథకం ప్రకారం చేసేవారని ఆరోపించారు. ఆ తరువాత తాను అనుకున్న పని చేసేవారన్నారు. లాభాలు ఇచ్చే బస్సు రూట్లను ప్రైవేటు పరం చేసి, నష్టాలు వచ్చే వాటిని ఆర్టీసీకే ఉంచాలని చంద్రబాబు చూసేవారన్నారు.

సభకు అధ్యక్షత వహించిన వైయస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియ‌న్ అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థకు వైయస్ ఎంతో మేలు చేశారని, ఇందుకుగాను ఆయన కుమారుడికి తామంతా మద్దతుగా ఉండి రుణం తీర్చుకుంటామని చెప్పారు. సభలో వై‌యస్‌ఆర్ ‌టియు అధ్యక్షుడు బి.జనక్‌ ప్రసాద్, ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డితో సహా పలువురు కార్మిక‌ నేతలు పాల్గొన్నారు.

Back to Top