'మహానేత వైయస్ రుణం తీర్చుకునే సమయమిదే'

రేణిగుంట (చిత్తూరు జిల్లా) : సింగిల్‌విండో ఎన్నికల ద్వారా దివంగత ‌మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి రు‌ణం తీర్చుకునే అవకాశం రైతులకు వచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యురాలు రోజా పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కాయంపేట సహకార సంఘ ఎన్నికలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించిన పార్టీ నాయకులు రోజా, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని అరెస్టు చేసి రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చారు.

ఈ సందర్భంగా విలేకరులతో రోజా మాట్లాడుతూ, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డికి పోలీసులు అమ్ముడుపోయి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డిఎస్‌సి స్వామి కాంగ్రెస్ నాయకుడి కంటే హీనంగా ప్రవర్తించారని‌ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి మాట్లాడుతూ, కుట్రలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రేణిగుంట పోలీ‌స్‌స్టేషన్‌లో రోజా, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని అరెస్టు చేసి ఉంచారన్న సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జువ్వల దయాక‌ర్‌రెడ్డి, మండల కన్వీనర్ హరిప్రసా‌ద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలి రావడంతో రోజా, మిధున్‌రెడ్డిని తిరుపతికి తరలించారు.
Back to Top