'మహానేత వైయస్‌ఆర్ వల్లే కాంగ్రెస్‌కు అధికారం'

ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై చేస్తున్న కుట్రలకు ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హెచ్చరించారు. శ్రీ జగన్‌ పట్ల రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న ఆదరణను తగ్గించాలని, ఆయనను ఇబ్బందులకు గురి చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న విషయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. శ్రీ వైయస్ జగ‌న్ విడుదల కావాలని కోరుతూ ఆచంట కచేరి సెంటరులో ఆదివారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం కావాలని రాష్ట్ర ప్రజలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారని శేషుబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఏడాదికి మూడు నాలుగు సార్లు విద్యుత్, ఆర్‌‌టిసి, డీజిల్ ధరలు పెంచి భారం మోపుతోందని విమర్శించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూసి ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అధికారం అప్పగించారన్నారు. ఆయన రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న ప్రస్తుత పాలకులు ఇందుకు భిన్నంగా పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భా‌రం మోపితే సహించేది లేదని, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని శేషుబాబు హెచ్చరించారు.
Back to Top