మహానేత కుటుంబం వెంటే ఉంటాం: సురేఖ

హైదరాబాద్, 14 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబాన్ని విడిచిపోయే ప్రసక్తే లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ చెప్పారు. ఎమ్మెల్సీ టికెట్ రాలేదని తాము పార్టీపై అలిగినట్లు, పార్టీ మారబోతున్నట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ఆమె తన భర్త, ఎమ్మెల్సీ అయిన కొండా మురళితో కలిసి మంగళవారం మధ్యాహ్నం చంచల్‌గుడా జైలుకు వెళ్ళారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయపరిణామాలు తమకు బాధ కలిగించిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాము తప్ప వేరేమీ కాదని కొండా సురేఖ చెప్పారు. ఈ విషయాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళామనీ, ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారనీ ఆమె తెలిపారు. పార్టీకి పూర్తిగా అండగా ఉండాలని ఆయన తమను కోరారని చెప్పారు. గతంలో ఎప్పడూ తాము దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబాన్ని వీడిపోలేదని తెలిపారు. భవిష్యత్తులో వీడిపోయే ప్రసక్తికూడా లేదని శ్రీమతి సురేఖ విస్పష్టంగా ప్రకటించారు.

పూర్తిస్థాయిలో పార్టీకోసం పనిచేస్తాం
ఇకనుంచి పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు సమయాన్ని కేటాయిస్తామని చెప్పారు. జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామల వల్ల కలిగిన బాధను తగ్గించుకునేందుకు తాము శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిశామని తెలిపారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మా మనసులోని బాధ పూర్తిగా తొలిగిపోయిందన్నారు. మేము పార్టీలు మారబోవడం లేదనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పారు. ప్రజలు కూడా మరో విధంగా భావించరాదని కోరారు. పార్టీని ఏ విధంగా నడిపిస్తే బాగుంటుందో అధ్యక్షుడు తమకు సూచించారన్నారు. జరిగిన పొరపాట్ల విషయంలో పార్టీ అధ్యక్షుడి అభిప్రాయం తెలుసుకున్నాక మీడియా ముందుకు రావాలని భావించి, నిశ్శబ్దంగా ఉన్నామన్నారు. జగన్మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యేవరకూ అవిశ్రాంతంగా పనిచేస్తామన్నారు. తాము పార్టీ విడిచిపోతామన్న అనుమానం పెట్టుకోవద్దని ఆమె పార్టీ క్యాడర్‌కు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top