మహానేత హయాం సువర్ణయుగం: సోమయాజులు

హైదరాబాద్, 14 మే 2013:

మహానేత డాక్టర్ వైయస్ఆర్ పరిపాలన స్వర్ణయుగమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడూ, పార్టీ సలహాదారు అయిన డి.ఎ. సోమయాజులు పేర్కొన్నారు. డాక్టర్ వైయస్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం నాటికి సరిగ్గా తొమ్మిదేళ్ళయ్యిందని  చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహానేత సంక్షేమ కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు. డాక్టర్ వైయస్ఆర్ పదవీ స్వీకారం చేసిన వెంటనే 800 కోట్ల రూపాయల విలువైన ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేశారనీ, అలాగే విద్యుత్తు బిల్లుల బకాయిలను మాఫీ చేస్తూ కూడా ఉత్తర్వులు విడుదల చేశారనీ చెప్పారు. 2001 నుంచి 2004 వరకూ 1300 కోట్ల రూపాయల మేర పేరుకున్న సంగతి తెలిసిందేనన్నారు. ఐదేళ్ళ పాలనలో 28 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చారన్నారు. ఈ సమయంలో ఉచిత విద్యుత్తు ఖర్చు 1500 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. 30 లక్షల మందికి ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ, 104, 108 సర్వీసులు వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా చేపట్టారని తెలిపారు. 80 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు, రెండు రూపాయల కిలో బియ్యం, తదితర పథకాలను ప్రజా సంక్షేమం కోసం చేపట్టారన్నారు.

చంద్రబాబుది దుష్పరిపాలన
చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ పాలన దుష్పరిపాలన అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆస్తుల, అప్పుల నిష్పత్తి 100:101 ఉంటే ఆయన పదవి దిగే సమయానికి 45:100కి పడిపోయిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత 1956 నుంచి 38 ఏళ్ళ పాటు 1994 వరకూ రెవెన్యూ లోటు అనేది లేదన్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. తెచ్చిన అప్పులన్నీ ఖర్చులకే వినియోగించి ఆస్తులను ఏర్పరచకుండా చంద్రబాబు పరిపాలించారని విమర్శించారు. ఏటా అన్ని చార్జీలు పెంచారని చెప్పారు. సంస్కరణల పేరిట ఈ చర్యలు తీసుకున్నారన్నారు.

1989 నుంచి 1994 వరకూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీయస్ఈబీకి క్రమం తప్పకుండా ఆపరేటింగ్ ప్రాఫిట్సు వచ్చాయనీ, కానీ  ఆ తదుపరి చంద్రబాబు ముఖ్యమంత్రయిన తర్వాత నష్టాలు వచ్చాయన్నారు. ఇది మొత్తం 20వేల కోట్ల రూపాయలని చెప్పారు. చార్జీలు పెంచినా ఎందుకు నష్టాలొచ్చాయంటే సమాధానం లేదన్నారు. అత్యంత విలువైన భూములను ఐఎమ్‌జీకి కేవలం 50 వేల కోట్ల రూపాయలకే కట్టబెట్టారనీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించిందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థకు 29 లక్షల రూపాయలకే భూమిని కేటాయించారన్నారు. అర్ధరాత్రి పూట 23 ఎమ్ఓయూలు చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారు కూడా కాని వారితో గ్యాస్ పవర్ ప్రాజెక్టులకు సంతకాలు కూడా పెట్టారని తెలిపారు. నిజాం సుగర్సు లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారని చెప్పారు. అనేక పరిశ్రమలు మూతబడ్డాయన్నారు. ఇన్ని అవలక్షణాలున్నాయి కాబట్టే చంద్రబాబు పాలనను ప్రజా వ్యతిరేక ప్రభుత్వమనీ, దుష్పరిపాలననీ అంటున్నామని వివరించారు.

డాక్టర్ వైయస్ఆర్ పాలనలో అభివృద్ధి మంత్రం
చంద్రబాబు తొమ్మిదేళ్ళ హయాంలో 5.7శాతం ఉన్న వార్షిక అభివృద్ధి రేటు మహానేత పాలించిన ఐదేళ్ళలో 9.7శాతానికి పెరిగిన అంశాన్ని సోమయాజులు గుర్తుచేశారు. వ్యవసాయం అభివృద్ధి చంద్రబాబు హయాంలో 3 నుంచి 7 శాతానికి పెరిగిందనీ, ఇది దేశంలో అత్యధిక వృద్ధనీ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి రాజశేఖరరెడ్డిగారి హయాం స్వర్ణయుగమన్నారు. ఆ కాలంలో విద్యుత్తు చార్జీలు చాలా తక్కువని చెప్పారు. అంతకు ముందు ప్రతి రెండు, మూడేళ్ళకూ చార్జీలు పెంచిన విషయం తెలిసిందేనన్నారు. 2004 నుంచి 2009 వరకూ చార్జీలు పెంచకపోవడమే కాకుండా 75 పైసలు తగ్గించి విద్యుత్తు సరఫరా చేశారని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఇలా జరగలేదనీ, అందుకే మన రాష్ట్రంలో వార్షిక పారిశ్రామికాభివృద్ధి రేటు పది శాతం పెరిగిందనీ సోమయాజులు వివరించారు. రాజశేఖరరెడ్డిగారి స్వర్ణయుగాన్ని ఎవరూ మరిచిపోలేరనీ, బీదలకు ఆయన ఒక మెస్సయ్యలాంటివారనీ ఆయన కొనియాడారు.

రాజశేఖరరెడ్డిగారు మరణించే నాటికి రాష్ట్రానికి మొత్తం రుణం 93వేల కోట్లుంటే.. 2012-13కి లక్షా యాబైమూడువేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. వచ్చే ఏడాదికి మరో ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు తెస్తామని కిందటి బడ్జెట్లో ప్రతిపాదించారని చెప్పారు. ఇంత అప్పు తెచ్చి కూడా పింఛను రూపాయి పెంచలేదున్నారు. ఫీజు రీయింబర్సుమెంటును తుంగలో తొక్కారన్నారు. చార్జీలు పెరుగుతున్న అదుపుచేయడానికి ప్రయత్నించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మాని శ్రీ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం ప్రారంభించారన్నారు. లక్ష కోట్ల అవినీతి అని చెప్పి చివరికి సీబీఐ చివరికి ఎంత అవినతి తేల్చిందో అందరికీ తెలిసిందేనన్నారు.   సీబీఐ చార్జిషీట్లలో కేవలం వెయ్యి కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇది కూడా లావాదేవీల మొత్తం మాత్రమేనని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బదీయడమే దీనివెనుక ఉద్దేశమని స్పష్టమవుతోందన్నారు.

మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే కన్నా వ్యాఖ్యలు
ట్రయల్‌ కోర్టులో ఒకలా, సుప్రీంకోర్టులో మరోలా సీబీఐ వాదనలు వినిపిస్తోందని ఆయన ఆరోపించారు. సీబీఐ కూడా  చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ కలిసి శ్రీ జగన్మోహన్ రెడ్డిని అన్నిరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయన్నారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డినుద్దేశించి మంత్రి కన్నా లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. 26 జీవోలు సరైనవే అని సుప్రీం కోర్టులో చెప్పిన మంత్రి కన్నా, ఇప్పుడేమో శ్రీ జగన్మోహన్ రెడ్డి  వల్లే మంత్రులు జైలుకు వెళ్తున్నారనడం ఎంతవరకు సమంజసమని సోమయాజులు ప్రశ్నించారు. చంద్రబాబు సోమవారం నాడు గవర్నరును కలిసి కళంకిత మంత్రులను తొలగించాలని కోరడంతో తమనెక్కడ మంత్రివర్గం నుంచి తీసేస్తారోనని భయపడి ఇలా మాట్లాడి ఉంటారనే అనుమానం కలుగుతోందని సోమయాజులు చెప్పారు.

బయ్యారంపై షర్మిలను కాదు ప్రభుత్వాన్ని అడగండి
బయ్యారం గనుల అంశంలో శ్రీమతి షర్మిల సమాధానం చెప్పాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఈ అంశంలో ఆమెకేమిటి సంబంధమని ప్రశ్నించారు. ఏదైనా అడగాల్సి వస్తే ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. బయ్యారం అంశంలో ఏ ప్రాతిపదిక పాటించారని ప్రభుత్వాన్ని అడగాలన్నారు. ఒకవేళ శ్రీమతి షర్మిల సమాధానమిస్తే అధికారపూర్వకంగా చెప్పినట్లవుతుందా అని నిలదీశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top