మహాధర్నాకు తరలివచ్చిన జన సమూహాలు

బాధ్యతలనుంచి ప్రభుత్వాలు తప్పించుకోజూసినపుడు  ప్రజలు పోరుబాట ఎంచుకోక తప్పదు. నిరసనలతో... ఆందోళనలతో.... అవసరమైతే ఆగ్రహావేశాలతో పాలకులపై తిరుగుబాటు చేయకా తప్పదు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపందుకుని సత్తెనపల్లిలో నిర్వహించిన ‘మహాధర్నా’కు కదిలివచ్చిన ప్రజానీకాన్ని చూస్తే రాష్ట్ర ఏలికలపై పేరుకుపోయిన ఏవగింపు విశదమవుతోంది.

గుంటూరు:
జిల్లావ్యాప్తంగా ప్రజానీకం సత్తెనపల్లికి పోటెత్తారు. మహాధర్నాలో కదం తొక్కారు. మునుపెన్నడూ లేని విధంగా సత్తెనపల్లి రహదారులన్నీ జనంతో కిక్కిరిశాయి. రాష్ట్రంలో అసాధారణ విద్యుత్తు కోతలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా సత్తెనపల్లిలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీమతి వైయస్ షర్మిల పాల్గొన్న ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి రావడంతో మహాధర్నా ప్రాంతంతోపాటు పట్టణం అంతా జనంతో కిటకిటలాడింది.

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఉదయం వెన్నాదేవి శివారు ప్రాంతంలోని బస కేంద్రం నుంచి వేలాది మంది కార్యకర్తలతో పాదయాత్రగా పట్ణణం వైపు సాగారు. పట్టణంలోకి ప్రవేశించిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముస్లిం బజారులోని ప్రతి ఇంటి నుంచి మహానేత బిడ్డను చూసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. ఐదులాంతర్ల సెంటరు వద్దకు యాత్ర రాగానే పలు గ్రామాల ప్రజలు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు.

     అక్కడి నుంచి యాత్ర మాచర్ల ప్రధాన రహదారిపై ఉన్న గడియారం స్తంభం వైపు సాగింది. అక్కడ మేడలపై ఉన్న యువకులు షర్మిలపై పూలవర్షం కురిపించారు. అశేష జనవాహిని మధ్య తాలూకా సెంటరులో దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అనంతరం పార్టీ చేపట్టిన మహాధర్నా వద్దకు షర్మిల చేరుకున్నారు.

ప్రజానీకం కేరింతలు...

     వేదికపై శ్రీమతి షర్మిల ప్రసంగాలు, హావభావాలు తన అన్న శ్రీ జగన్మోహన్‌ రెడ్డిని పోలి వుండటంతో తరలివచ్చిన ప్రజానీకం కేరింతలు కొట్టారు. ‘మీ రాజన్న బిడ్డను, మీ జగనన్న చెల్లిని’ అంటూ షర్మిల ప్రసంగం ప్రారంభించగానే సభాస్థలి జై జగన్ అనే నినాదాలతో దద్దరిల్లింది. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలపై షర్మిల ప్రసంగించినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

విద్యుత్తు కోతతో రైతన్నకు అగచాట్లు:  విజయమ్మ

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సతీమణి శ్రీమతి విజయమ్మ తన ప్రసంగంలో రైతులు కరెంటు కోత వల్ల పడుతున్న అగచాట్లు వివరించారు. సాగు నీరు లేక రైతులు కొన్ని చోట్ల క్రాప్ హాలిడే ప్రకటించారనీ, పల్నాడు వంటి ప్రాంతాల్లో అప్పులు తీర్చేందుకు కిడ్నీలు సైతం అమ్ముకునే దుస్థితి ఏర్పడిందనీ, బొగ్గును కూడా వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వచ్చిందనీ వివరించారు.

     పల్లెలు, పట్టణాలు, యువకులు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా విద్యుత్తు కోతలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రాజన్నరాజ్యం కోసం వ్యవసాయ కూలీలు, కార్మికులు, వ్యాపారులు తమ పనులను పక్కనపెట్టి మరీ విచ్చేశారు.  ఎండను లెక్క చేయక రోడ్లు, మేడలు, మిద్దెలపై నిలుచుని నేతలు ప్రసంగాలను విన్నారు.

Back to Top