ప్ర‌త్యేక హోదా కోసం మ‌రొక‌రు ప్రాణ‌త్యాగం

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం మ‌రొక‌రు ప్రాణ‌త్యాగం చేశారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెకు చెందిన సుధాక‌ర్‌(26) అనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదా అంశంపై పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానం చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంలో కేంద్రం ప్ర‌త్యేక హోదాఇచ్చేది లేద‌ని తేల్చి చెప్ప‌డంతో పాటు, చంద్ర‌బాబు అంగీకారంతోనే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌ని, ప్యాకేజీకి చంద్ర‌బాబు ఒప్పుకున్నార‌ని చెప్పారు. దీంతో ప్ర‌త్యేక హోదా రాద‌ని నిరాశ‌కు గురైన సుధాక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏపీకి చేసిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఈ నెల 24న వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర బంద్ చేప‌డితే, ఆ బంద్‌ను విఫ‌లం చేసేందుకు చంద్ర‌బాబు పోలీసుల‌తో బ‌ల‌వంతంగా అరెస్టులు చేయించారు. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కృష్ణాపురం గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క‌ర్త దుర్గారావు గుండెపోటుతో మృతిచెందాడు. నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రో గుండె ఆగిపోవ‌డంతో ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా కోసం ఎంత‌గా ప‌రిత‌పిస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. గ‌తంలో చిత్తూరుకు చెందిన ముని కామకోటి అలియాస్ బీఎంకే కోటి(41) ప్ర‌త్యేక హోదా కోసం ఒంటికి నిప్పంటించుకొని తుదిశ్వాస విడిచాడు.  ఆయన ఆత్మార్పణం రాష్ట్ర ప్రజలను, రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కోటి బలిదానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

 
Back to Top