లౌక్యంగా ఓటు వేయండి

–వైయస్‌ఆర్‌సీపీ పోటీ పెట్టకపోయి ఉంటే బాబు నంద్యాలకు రూపాయి కూడా ఇచ్చేవారు కాదు
–చంద్రబాబు కేబినెట్‌ అంతా నంద్యాలలోనే మకాం. 
–బాబు ఓట్లు వచ్చే మాటలే చెబుతారు
– ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వడ్డీకి కూడా సరిపోవడం లేదు
–బాబు పుణ్యమా అని జాబు రాలేదు..ప్రత్యేక హోదా రాలేదు
– ఎన్నికలు అయిపోయాక వెన్నుపోటు పొడుస్తారు
– పుసుపు కుంకుమ పథకమా? ఉప్పుకారం పథకమా?
– అభివృద్ధి పేరుతో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
 
నంద్యాల: ఉప ఎన్నికలో గెలిచేందుకు చంద్రబాబు డబ్బు మూటలతో వస్తున్నారని, నంద్యాల ఓటర్లు లౌక్యంగా ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభ్యర్థించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్లు వచ్చే మాటలు చెబుతారని, ఆ తరువాత వెన్నుపోటు పొడుస్తారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెండో రోజు సాయంత్రం జిల్లెల్ల గ్రామంలో వైయస్‌ జగన్‌ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఇవాళ నంద్యాల ఉప ఎన్నిక  జరుగుతున్న తీరును గమనిస్తే మనందరికి అర్థమయ్యేది ఒక్కటే. మూడున్నర సంవత్సరాల నుంచి ఇంతవరకు నంద్యాలలో ఇంతటి హడావుడి ఎప్పుడు లేదు. చంద్రబాబు కేబినెట్‌ అంతా ఇక్కడే ఉంది. టీడీపీ సీనియర్‌ నాయకులు అంతా ఇక్కడే మకాం వేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు ఇద్దరు కూడా నంద్యాల రోడ్లపై తిరుగుతున్నారు. నంద్యాలకు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణ ఏంటంటే..నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ పెట్టడమే.. ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా వదిలిపెట్టి ఉంటే ఇవాళ చంద్రబాబు నంద్యాలకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఉండేవాడు కాదు. వీరంతా నంద్యాలలో కనిపించేవారా అని అడుగుతున్నాను. రాష్ట్రంలో ఉన్న అందరికి తెలుసు. నంద్యాలలోనే చుట్టుప్రక్కల నియోజకవర్గాలకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిన ప్రాంతాల్లో ఎంతటి అభివృద్ధి జరిగిందో అందరికి తెలుసు. చంద్రబాబు నైజం గురించి ఒక్క సారి గమనిస్తే..టీడీపీ గెలిచిన 102 నియోజకవర్గాలు, మంత్రుల నియోజకవర్గాల్లోగానీ, పార్టీ ఫిరాయించిన 20 నియోజకవర్గాల్లో చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. 

మోసం చేయడం బాబుకు అలవాటు
అధికారం కోసం మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైందని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలేంటి? ఎన్నికల సమయంలో ఏదీ మాట్లాడితే ఓట్లు వస్తాయే అదే మాట్లాడుతారు. ఆ తరువాత మోసం చేయడం చంద్రబాబు నైజం. బాబు సీఎం కావడం కోసం రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయిన తరువాత రుణాల మాఫీ దేవుడెరుగు, రైతులు అపరాధ వడ్డీ కడుతున్నారు. రైతులు బ్యాంకు గడప ఎక్కలేక, అప్పులు పుట్టక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. సున్నా వడ్డీ డబ్బులు ఇవ్వడం మానేశారు. పసుపు కుంకుమ అని కొత్త పథకం తెచ్చి బ్యాంకుల్లో అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి వసూలు చేయిస్తున్నారు. ఇది పసుపు కుంకుమ పథకమా? అక్క చెల్లెమ్మల కళ్లలో ఉప్పు, కారం కొట్టే పథకమా? అని అడుగుతున్నాను. 

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు
ఎన్నికల సమయంలో ఏపీకి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆయనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చదువుకుంటున్న పిల్లలను వదిలిపెట్టలేదు. చంద్రబాబు పుణ్యమా అని జాబు రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక హోదానే సంజీవని అని తెలుసు. అలాంటి ప్రత్యేక హోదాను సీఎం అయ్యాక తాకట్టు పెట్టారు.  ప్రతి పేద వాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. చంద్రబాబు సీఎం స్థాయిలో కర్నూలుకు వచ్చి స్వాతంత్య్ర వేడుకల్లో హామీలు ఇచ్చారు. కర్నూలులో త్రిపుల్‌ ఐటీ, రైల్వే వ్యాగన్ల కంపెనీ పెడతానన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు కడుతానని చెప్పి ఇప్పటికి మూడేళ్లు అవుతుంది. వీటిలో ఒక్కటి కూడా చేయలేదు. సీఎం కావడం కోసం అబద్ధాలు చెప్పారు. అయ్యాక మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారు.అరిగిపోయిన టేప్‌రికార్డు మళ్లీ ఆన్‌ చేశారు. 

ప్రతి పనిలోనూ కమీషన్లే
చంద్రబాబు ఏ పని చేపట్టినా కమీషన్లు తీసుకుంటున్నారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. నంద్యాలలో ఒక రోడ్డు పగులగొట్టారు. దాంతోనే నంద్యాల నియోజకవర్గమంతా అభివృద్ధి అంటున్నారు. ఆ రోడ్డు పగులగొట్టేటప్పుడు ఎన్నో కుటుంబాలు వీధుల్లో పడ్డాయి. బాధితులతో మాట్లాడి మార్కెట్లో ఉన్న రేటు ఇచ్చి రోడ్లు పగులగొట్టాలి. నంద్యాలలో అభివృద్ధి అంటూ హడావుడి చేసి రోడ్లు పగులగొట్టారు. బాధితులకు రూ.18 వేలు ఇస్తారట. నంద్యాలలో 13 వేల ఇళ్లు కట్టిస్తారట.  ఒక్క అడుగు కట్టడానికి వెయ్యి రూపాయలు అవుతుంది. మాములుగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే రూ .3 లక్షలు ఖర్చు స‌రిపోతుంది. అయితే చంద్రబాబు దాన్ని రూ. 6 ల‌క్ష‌ల‌కు పెంచారు.  ఇందులో  రూ.3 లక్షలు బ్యాంకు లోన్‌ ఇస్తారట. ఆ లోన్‌ 20 ఏళ్ల పాటు బ్యాంకులకు నెల నెల ల‌బ్ధిదారుడు రూ.3 వేలు చెల్లించాలట.   చంద్రబాబు తీసుకునే లంచాలకు పేదలు కంతులు కట్టాలా? అని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

మహానేత పాలనలో రెండు పంటలు పండేవి
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన రెండు పంటలు పండించే వారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మూడేళ్లలో ఒక్క పంట కూడా పూర్తి స్థాయిలో పండలేదు. ఎన్నికల ముందు గుండ్రేవుల ప్రాజెక్టు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఉప ఎన్నికలో కూడా ఇలాంటి తప్పుడు హమీలు ఇవ్వడమే కాకుండా డబ్బు మూటలు తీసుకొని వస్తారు. చేతిలో దేవుడి ఫోటో పెట్టి ప్రమాణం చేయించుకుంటారు. అయితే మీరు మాత్రం మనసులో దేవుడిని తలచుకొని లౌక్యంగా ఓటు వేయాలని వైయ్‌ జగన్‌ సూచించారు. ధర్మానికి తోడుగా నిలవాలని, న్యాయానికి ఓటు వేయాలని, వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించాలని  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Back to Top