బుర్రలో గుజ్జులేని వ్యక్తి లోకేష్‌

  • సోషల్‌ మీడియా ద్వారానే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు
  • వ్యంగ్యంగా పోస్టులు పెడితే చంద్రబాబు కొంపేమైనా అంటుకుందా..?
  • ఇంటూరిని అరెస్టు చేసి వాళ్లను వారే కించపరుచుకున్నారు.
  • పొట్టకోస్తే అక్షరం రాని లోకేష్‌కి మంత్రి పదవా..? ట్రైనింగ్‌ ఇస్తేనే మంచిది
  • వాస్తవాలు మాట్లాడే ఓ సీనియర్‌ జర్నలిస్టుపై కుట్రలు చేశారు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: మీడియా, పత్రికలనంతా చంద్రబాబు తన ఆధీనంలోకి తీసుకున్న తరువాత సోషల్‌ మీడియా ద్వారానే ప్రజలు వాస్తవాలన్నీ గమనించగలుగుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. లోకేష్‌పై వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారనే కక్షతోనే ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని మండిపడ్డారు. అసలు రవికిరణ్‌ను ఎందుకు అరెస్టు చేశారో.. ఎందుకు విడుదల చేశారో పోలీసులకు కూడా తెలియడం లేదన్నారు. చట్టవ్యతిరేకంగా పనిచేస్తే పోలీసులు యాక్షన్‌ తీసుకోవాలి కానీ, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ మాటలు విని పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. సోషల్‌ మీడియాపై ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను ఆయన తప్పుబట్టారు. గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా... నిన్నటిరోజు సాయంత్రం వరకు రవికిరణ్‌ను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి పోలీసులు ఎందుకు ఇంటి దగ్గర వదిలేశారని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏపీ పోలీసులపై ఉందన్నారు.ఎలాంటి చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడని రవికిరణ్‌ను ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. 

పచ్చిబూతులు మాట్లాడే టీడీపీ నేతలపై చర్యలుండవా..?
రవికిరణ్‌ వ్యంగ్యంగా పోస్టింగ్‌లు పెడితే చంద్రబాబు కొంపేమైనా అంటుకుపోయిందా అని అంబటి ప్రశ్నించారు. రాహుల్‌గాంధీపైన, మోడీపైన కూడా పోస్టులు పెట్టాడు. ప్రజలంతా చూశారు. వాస్తవాలను గ్రహించారు... నవ్వుకున్నారు...అలాంటిది మీ మీద, మీ కుమారుడి మీద పోస్టులు పెడితే ఎందుకు ఓర్వలేని భావనలో ఉన్నారని చంద్రబాబును ప్రశ్నించారు.  అనంతపురం సభలో చంద్రబాబు, లోకేష్‌బాబు కూర్చున్న వేదికపై జేసీ దివాకర్ రెడ్డి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోరా..? జేసీ తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి పచ్చిబూతులు మాట్లాడితే వారిపై యాక్షన్‌ తీసుకోరా.. ?సోషల్‌ మీడియాపై మాత్రం నిప్పులు చెరుగుతారా అని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌ బాలసుబ్రమణ్యం అనే అధికారిపై దాడి చేస్తే వారిపై యాక్షన్‌ తీసుకోరా అని ప్రశ్నించారు. వ్యంగ్యంగా పోస్టులు పెడితే యాక్షన్‌ తీసుకుంటారా అని నిలదీశారు. పోలీసులు కూడా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు, లోకేష్‌ ఏం చెబితె అది చేయాలనే మైండ్‌ సెట్‌లో ఉన్నారని,  ఇది సరైన విధానం కాదని సూచించారు. 

ఏం ఉద్దరిస్తాడని మీ పుత్రరత్నాన్ని మంత్రిని చేశారు
మామిడికాయను పిందలోనే కోసి మగ్గేస్తే ఎలా కుళ్లిపోతుందో.. నారా లోకేష్‌ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బుర్రలో గుజ్జులేని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రి వర్గంలో మూడు శాఖలు అప్పగిస్తే గిలక్కాయలు ఆడుకుంటున్నాడని అంబటి విమర్శించారు. పరిణతి లేని వ్యక్తి మంత్రిని చేస్తే ఇలాగే ఉంటుందన్నారు. ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా మంచి నీళ్లు లేని పరిస్థితి తీసుకొస్తాడంట ఏం చేయాలి చంద్రబాబు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మా అబ్బాయి అమెరికా స్టాండ్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివాడని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఏం లాభం... పొట్టకొస్తే అక్షరం ముక్క రావడం లేదే అని ఎద్దేవా చేశారు. పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేసి అదమాలనే ప్రయత్నం చేయడం కంటే మీ అబ్బాయికి ట్రైనింగ్‌ ఇప్పించుకొని, బుర్రలో కాస్త గుజ్జు ఎక్కించే కార్యక్రమాలు చేయాలని హితవుపలికారు. లోకేష్‌బాబు మంత్రిగా అనర్హుడని, మంత్రిస్థాయి లోకేష్‌కు లేదన్నారు. టీడీపీలో సీనియర్‌ నేతలను వదిలి మీ పుత్రరత్నం ఏదో ఉద్దరిస్తాడని తీసుకొచ్చి పెట్టినందుకు ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. 

67 యాక్ట్‌ ఏం చెబుతుంది లోకేష్‌బాబూ?
రవికిరణ్‌ను అరెస్టు చేసి చంద్రబాబు, లోకేష్‌లు వారిని వారే కించపరుచుకున్నారని అంబటి రాంబాబు సూచించారు. 2015లో జస్టిస్‌ చలమేశ్వర్‌ ఐటీ యాక్ట్‌పై ఓ తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 67 యాక్ట్‌ ప్రకారం.. ఏ విధమైన అరెస్టులు చేయడానికి వీళ్లేదు. భావప్రకటన స్వేఛ్చను హరించే హక్కు ఎవరికీ లేదని చలమేశ్వర్‌ తీర్పు ఇచ్చారన్నారు. సోషల్‌ మీడియాను కంట్రోల్‌ చేయాలని చేస్తే అది మిమ్మల్నే మింగుతుందని చంద్రబాబు, లోకేష్‌లకు చురకంటించారు. చంద్రబాబు కారణంగానే సోషల్‌ మీడియాను ప్రజలకు ఇంతగా ఆదరిస్తున్నారని, మీడియాను తన అదుపులో పెట్టుకోవడం వల్లేనన్నారు. చంద్రబాబు గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన ఓ టీవీ జర్నలిస్ట్‌ను అన్యాయంగా పక్కనబెట్టించారని, ఆ ఛానల్‌ను కూడా ఏపీలో 4 నెలల పాటు ప్రసారం కానివ్వకుండా ప్రబుద్ధుడు లోకేష్‌ చేశారన్నారు. పొలిటికల్‌ పంచ్‌ చూసి భయపడుతున్న చంద్రబాబు పవర్‌ పంక్చర్‌ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వాస్తవాలు ఎన్ని నాళ్లు దాచినా.. దాగవు.. ఆగవని స్పష్టం చేశారు. 
Back to Top