లోకేష్‌కు పెద్దలసభలో కూర్చునే అర్హత లేదు

  • అక్రమ సంపాదనతో టీడీపీ సభ్యత్వాలు
  • ఓటరు లీస్టులో ఫోటోలతో సభ్యత్వాల నమోదు
  • వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ కార్యదర్శి లాజర్‌కు టీడీపీ సభ్యత్వం  
  • చంద్రబాబు పాలన రాష్ట్రానికి అనారోగ్యం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: తప్పుడు సభ్యత్వాలు నమోదు చేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పెద్దల సభలో కూర్చునే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.  అవినీతి సొమ్ముతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ఏవిధంగా కొన్నారో అలాగే పార్టీ కార్యకర్తలను కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నారని, అయితే మీకు ఎవరు లొంగరని ఆయన హెచ్చరించారు. ఓటరు లీస్టు ఫోటోలతో టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. విజయవాడ నగరంలోని 26వ వార్డుకు చెందిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానుల ఫోటోలతో టీడీపీ నాయకులు డమ్మీ సభ్యత్వాలు నమోదు చేశారని ఆయన సాక్షాధారాలతో వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. ఓటర్‌ లీస్టులో ఉన్న ఫోటోలు పెట్టి  టీడీపీ మెంబర్‌ షిప్‌ ఇవ్వడంతోనే ఆ పార్టీ 70 లక్షల సభ్యత్వం నమోదు చేసిందన్నారు. ఇలాగే చేస్తే ఇండియాలోని 120 కోట్ల మందికి కూడా ఈవిధంగా టీడీపీ సభ్యత్వాలు ఇవ్వవచ్చు అని ఎద్దేవా చేశారు. ఓటర్లకు తెలియకుండానే సభ్వత్వాలు ఇవ్వడంతో వారు బాధపడుతున్నారని తెలిపారు. వసంత, వీరయ్య, లాజర్‌ విజయవాడలోని 26వ డివిజన్‌లో ఉంటారని, వీరంతా కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వీరాభిమానులన్నారు. వీరిలో లాజర్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా ఉన్నారని, అలాంటి వ్యక్తికి టీడీపీ సభ్యత్వం ఇవ్వడం దారుణమన్నారు. 26వ వార్డుకు చెందిన వీరంతా సంతకం పెట్టకుండానే, రుసుం వంద రూపాయలు చెల్లించకుండానే ఎలా సభ్యత్వం ఇచ్చారని నిలదీశారు. ఇటువంటి సభ్యత్వాలు 70 లక్షలు అంటే ఎవరైనా నమ్ముతారా? మేం చెప్పేది తప్పు అయితే ఇక్కడ ఉన్న వారిని వ్యక్తిగతంగా కూడా ప్రశ్నించవచ్చు అన్నారు.   ఇటువంటి డమ్మీ సభ్యత్వాలను ప్రజలు నమ్మరని చెప్పారు.

ఆస్తులు ప్రకటించమని ఎవరు కోరారు?
చంద్రబాబు కుటుంబం ఆస్తులు ప్రకటించమని ఎవరైనా అడిగారా అని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసే సమయంలో నారా లోకేష్‌ తన ఆస్తులు ప్రకటించారని తెలిపారు. ఆయన ప్రకటించిన ఆస్తులు ఆరు నెలల్లోనే 22 రెట్లు ఆదాయం పెరడంతో రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం వచ్చిందని, ఆ వార్త అన్ని పేపర్లు, సోషల్‌ మీడియాలో ప్రచురితమైతే సాక్షి పేపర్‌పై లోకేష్‌ కక్షగట్టారని తెలిపారు. సాక్షి చదవడం వల్ల అనారోగ్యం కాదు అని, చంద్రబాబు పాలనతోనే ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని అందరు భావిస్తున్నారని తెలిపారు.  టీడీపీ సభ్యత్వం 70 లక్షలు చేశారనే కారణంగా లోకేష్‌కు ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టడానికి ధ్వజమెత్తారు. ఇటువంటి తప్పుడు సభ్యత్వాలు చేసిన వారిని పెద్దల సభకు పంపిస్తే అక్కడ కూడా ఇలాంటి మోసాలే చేస్తారన్నారు. అందరూ చిన్నబాబు అని పిలిచే లోకేష్‌ ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభకు రావాలి తప్ప, ఇటువంటి తప్పుడు సభ్యత్వాలు చేసి మీరు పెద్దల సభలో కూర్చోవడం సిగ్గుచేటు అన్నారు.  

సభ్యత్వం పేరుతో ప్రజలకు ఆఫర్లు
ప్రజలను మభ్యపెట్టేందుకు సభ్యత్వం పేరుతో ప్రజలకు ఇన్సూరెన్స్, హెల్త్‌ స్కీంలు అంటూ ఆఫర్లు ఇస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాసు ఆరోపించారు. తప్పడు సభ్యత్వాలు నమోదు చేసినందుకు టీడీపీ నేతలు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తప్పుడు సభ్యత్వాలపై న్యాయపోరాటం చేస్తామని వెల్లంపల్లి హెచ్చరించారు. అధికారంలో ఉన్నామని ఇటువంటి జిమ్మికులకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. 70 లక్షల సభ్యత్వం చేశామని మీరు డబ్బాలు కొట్టుకోవడంతో అవి తప్పు అని చూపించడానికి శాంపిల్‌గా నలుగురిని మీడియా ముందుకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం అక్రమంగా డబ్బులు సంపాదించి, ఆ డబ్బుతో ఇలా డమ్మీ సభ్యత్వాలు చేయించుకుందని విమర్శించారు. ఇలాంటి చర్యలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని చెప్పారు.   
Back to Top