అకార‌ణంగా లోక్‌స‌భ వాయిదా

న్యూఢిల్లీ:  లోక్‌స‌భ‌ను అకార‌ణంగా వాయిదా వేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. శుక్ర‌వారం స‌భా వాయిదా అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఇవాళ లోక్‌స‌భ‌లో ప్రైవేట్ బిల్లు ప్ర‌వేశపెట్టేందుకు తాను సిద్ధ‌మ‌య్యానని తెలిపారు. అయితే ఎలాంటి కార్యాక‌లాపాలు జ‌రుగ‌కుండానే స‌భ‌ను వాయిదా వేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను వినిపించేందుకు తాము పోరాడుతుంటే కేంద్రం నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న హామీని ప్ర‌శ్నించ‌డం త‌ప్పా అని నిల‌దీశారు. ప్ర‌త్యేక హోదా అడిగే హ‌క్కు మాకు లేదా అని మండిప‌డ్డారు. తామేమి గొంత‌మ్మ కోర్కెలు కోర‌డం లేద‌ని, ఏపీకి రావాల్సిన న్యాయ‌మైన వాటినే అడుగుతున్నామ‌న్నారు. లోక్‌స‌భ వాయిదా వేసి త‌మ‌ను అడ్డుకున్న తీరుకు నిర‌స‌న‌గా న్యాయ‌పోరాటం చేస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు. 
స్పీక‌ర్ సానుకూలంగా స్పందించారు
జ‌న‌వ‌రి 26న విశాఖ ఏయిర్‌పోర్టులో పోలీసులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఎంపీల‌తో వ్య‌వ‌హ‌రించిన తీరుపై లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త‌మ‌ను అకార‌ణంగా ఏయిర్‌పోర్టులో నిర్భందించార‌ని, ఈ విష‌యంలో ప్రివిలేజ్ క‌మిటీతో విచార‌ణ చేప‌ట్టి పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. ఇందుకు స్పీక‌ర్ సానుకూలంగా స్పందించార‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Back to Top