ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకో

రైతుల కోసం ఏ ఒక్కటైనా చేశావా..
దిక్కుతోచని స్థితిలో వలసలు పోతున్నారు..

హైదరాబాద్:
వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చంద్రబాబుపై
తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు గుంటూరు  వ్యవసాయ యూనివర్శిటీ
శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై తాము చర్చలకు సిద్ధమని
నాగిరెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు అన్నీ అవాస్తవాలే
మాట్లాడుతున్నారని.. రూ. 24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఎవరికీ చెల్లించారో
జాబితా ప్రకటించాలన్నారు. ఏపీలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని
ఎదుర్కొంటుందని... కరవు వల్ల లక్షల మంది రైతులు వలసలు పోతున్నారన్నారు.

పట్టిసీమ
ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామన్న విషయం ఏమైందని నాగిరెడ్డి
చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు, కరవు కవల పిల్లలుగా మారి తమను
సంక్షోభంలోకి నెట్టేశారని రైతాంగం అనుకుంటుందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.  రాష్ట్రం ఇబ్బందుల్లో
ఉన్నా సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నామని చంద్రబాబు మాట్లాడడం
దుర్మార్గమన్నారు. మోసపూరిత మాటలు మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు
గురిచేయవద్దని నాగిరెడ్డి చంద్రబాబుకు హితవు పలికారు. 

రుణాల
మాఫీ లేదు. రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ ఊసేలేదు. పంటలకు
గిట్టుబాటు ధర కల్పించడంలో గానీ , బోనస్ ప్రకటించడంలో ఇలా అన్ని ప్రభుత్వం
అన్ని విధాలుగా పూర్తిగా వైఫల్యం చెందిందని నాగిరెడ్డి విమర్శించారు. తన
సొంత పనుల కోసం వేలాది కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న
చంద్రబాబుకు...రైతుల బాధలు పట్టడం లేదా అని నిలదీశారు.  ఏడాదిన్నర పాలనలో
రైతుల కోసం ఏ ఒక్కటైనా చేశావా అని నాగిరెడ్డి చంద్రబాబును నిలదీశారు.
హామీలు అమలు చేయకుండా రైతాంగానికి దోచిపెడుతున్న విధంగా చంద్రబాబు
వాస్తవాలు వక్రీకరించి మాట్లాడడం సరికాదన్నారు.
Back to Top