అవినీతి ప్రభుత్వంపై ఉద్యమిద్దాం

హంద్రీనీవాపై బాబు అశ్రద్ధ
ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీత

అనంతపురంః చంద్రబాబు పాలన తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. హంద్రీనీవాతోనే అనంత జిల్లా సస్యశ్యామలం వుతుందని..ఆదిశగా ప్రభుత్వం అడుగులు వేయకుండా  అశ్రద్ధ వహిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్జీవో హాంలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబులు సమావేశం జరిగింది. ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీ పనులను ప్రారంభించి...జిల్లాలోని 3 లక్షల 50 ఎకరాలకు సాగునీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

హంద్రీనీవాకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారని, బాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. 2004లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హంద్రీనీవాకు ఓ రూపకల్పన చేసి బడ్జెట్ లో రూ. 6800 కోట్లు కేటాయించి పనులను వేగవంతం చేశారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం  రూ. 558 కోట్లు మాత్రమే కేటాయించిందంటే... ప్రాజెక్ట్ లపై బాబుకు ఎంత శ్రద్ధ ఉందో  అర్థమవుతోందన్నారు. 

ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని వేల కోట్లు ఖర్చుపెట్టిన బాబు,  ఇప్పటివరకు సీమకు ఎన్ని టీఎంసీల నీరు అందించారో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించకుండానే హంద్రీనీవా పూర్తి చేసి అనంతకు నీళ్లుఇస్తానంటూ బాబు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. 

అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే పట్టిసీమను పక్కనబెట్టి త్వరగా హంద్రీనీవాను పూర్తి చేయాలని చెప్పామని, తద్వారా కృష్ణా జలాలను జిల్లాకు అందించాలని ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పట్టిసీమ వైపు  మొగ్గు చూపిందన్నారు. ప్రభుత్వానికి  ఓ ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకు పోతోందన్నారు.  బాబు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఉద్యమం చేద్దామని విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. 

వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు.  కుప్పంనకు  నీళ్లు తీసుకుపోయేందుకు పనులు వేగవంతం చేస్తున్న బాబు..ముందుగా అనంతలోని ప్రతి ఆయకట్టుతో పాటు అన్ని చెరువులకు సమృద్ధిగా నీరు ఇచ్చాకే కుప్పం తీసుకెళ్లాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామన్నారు. 
Back to Top