లెక్క తేలుద్దాం రా

– చంద్రబాబుకు సవాల్‌ విసిరిన బొత్స సత్యనారాయణ
– ప్రభుత్వ లెక్కలన్నీ తప్పని ఆధారాలతో సహా నిరూపణ
– యనమల నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచన
– ప్రతిపక్షానికి సమాధానం చెప్పుకోలేక విసుర్లా 

హైదరాబాద్ః తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని వైయస్‌ ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీడీపీ, అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ వాస్తవ దూరాలని సోసియో ఎకనమిక్‌ సర్వే ఆధారంగా ఆయన నిరూపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... మీరు చెప్పుకునే అభివృద్ధిపై ప్రభుత్వం తరఫున అధికారులను ఎవరినైనా చర్చకు పంపాలని సవాల్‌ విసిరారు. అభివృద్ధి, జీడీపీ, ఆర్థిక శాస్త్రం గురించి మీకేం తెలుసని ప్రశ్నించే మీరు చర్చకు వచ్చే దమ్ముందా అని నిలదీశారు.

మొక్కజొన్న ఉత్పత్తిలో పదేళ్లుగా ముందున్నాం
మూడు ప్రధాన రంగాల్లో రాష్ట్రం వెనకబడి పోయిందని సోసియో ఎకనమిక్‌ సరే ప్రకారం తేటతెల్లమైందని బొత్స తెలిపారు. గతేడాది 13 లక్షల హెక్టార్లలో పంట సాగైతే ఈ సంవత్సరం 9.22 లక్షల హెక్టార్లకు పడిపోతే దీన్ని అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పే మొక్కజొన్న ఉత్పత్తిలో పదేళ్లుగా ఏపీ ప్రథమ స్థానంలో ఉందని బాబు సీఎం అయ్యాక సాధించిన ఘనతేమీ కాదని తెలిపారు. తాను మాట్లాడే ప్రతి పాయింట్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డేటానేనని స్పష్టం చేశారు. ఇంతకీ ఈ రెండిట్లో ఏది నిజమో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన 7.3 శాతం జీడీపీ ప్రకారం 29శాతం వృద్ధి సాధిస్తే మీరు చెప్పుకునే 12 శాతానికి 43 శాతం వృద్ధి సాధించాలని తెలియజేశారు. 43 శాతం వృద్ధి సాధించామని ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం  వాస్తవానికి గతేడాదితో పోల్చుకుంటే ఈసారి తగ్గిపోయిన సంగతి గుర్తెరగాలని పేర్కొన్నారు. 

హెక్టారుకు 6.5 టన్నుల ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు 2010–11లోనే 8.5 టన్నుల ఉత్పత్తి సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. పరిశ్రమల రంగం గురించి మాట్లాడుతూ దాదాపు లక్ష కోట్లు పెట్టుబడులు సాధించామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా 256 కంపెనీలు ఏర్పాటు చేశామని ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయని చెప్పుకోవడం పెద్ద జోక్‌ అని అన్నారు. ఏ జిల్లాలో పరిశ్రమలు ప్రారంభించారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎంత ఉత్పత్తి సాధించారు. లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓపక్క ఉత్తరాంధ్రలో పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా మూతబడుతుంటే ఈ మాట చెప్పుకోవడానికి సిగ్గుచేటన్నారు. జూట్‌ మిల్లులన్నీ మూతబడగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుందన్నారు. 

ప్రతిపక్షంలో ఏం చేశావో గుర్తులేదా
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం నానా హడావుడి చేసి ఉన్నదానికి లేనిదానికి అంతెత్తున ఎగిరిపడి పోయేవాడని బొత్స ఆరోపించారు. కానీ నేడు ప్రతిపక్షం ఉన్న లెక్కలను ఎత్తి చూపితే సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నించడం దారుణమన్నారు. కాకి లెక్కలతో ఎంతోకాలం ప్రజలను మోసం చేయలేరన్నారు. ఆనాడు మహానేత ఇళ్లు కట్టిస్తే అడ్డుకోవాలని చూశావ్‌.. పేర్లు పెట్టావ్‌.., ఆరోగ్యశ్రీతో పేదవారికి వైద్యం చేయిస్తుంటే ప్రభుత్వ వైద్య శాలల గతేంకావాలని మొసలి కన్నీరు కార్చావ్‌.. ఉచిత విద్యుత్‌ ఇస్తే ఇప్పుడు నువ్‌ ఛార్జీలు పెంచావ్‌.. జలయజ్ఞంతో పొలాలకు నీళ్లిస్తుంటే ధనయజ్ఞం అని ప్రచారం చేశావ్‌.., ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ తో పిల్లలను చదివిస్తే ఓర్చుకోలేకపోయావ్‌.., ఇన్ని చేసి ఇప్పుడు వాస్తవాలను మాట్లాడే ప్రతిపక్షంపై నిందలు వేయాలని చూడటం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనమని బొత్స ఎద్దేవా చేశారు. 

ఈనాడు పోలవరం పనులు కనీసం మొదలయ్యాయంటే అది కూడా వైయస్‌ఆర్‌సీపీ చలవే అన్నారు. మా పార్టీనే లేకుంటే ప్రత్యేక హోదా మాదిరిగానే దాన్ని కూడా అటకెక్కించేవారని మండిపడ్డారు. ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో సహా రావాలి. నోటి కొచ్చినట్టు అసత్యం ప్రచారం చేయడం సరికాదని టీడీపీ నాయకులకు హితవు పలికారు. నేను ఆధారాలతో వచ్చి మాట్లాడుతున్నా నువ్‌ కూడా నీ అధికారులను పంపు అని సవాల్‌ విసిరారు. తాను ప్రభుత్వం ఇచ్చిన ఆధారాల ప్రకారమే మాట్లాడుతున్నానని ప్రతి అంశంపై తనకు అవగాహన ఉందన్నారు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన తనకు యనమలతో చెప్పించుకునే ఖర్మ పట్టలేదన్నారు. ఆధారాలతో సహా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి త్వరలోనే లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ఎదుట వారి గురించి ఏదైనా ఆరోపణలు చేసే ముందు మనమేంటో చూసుకోవాలని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

Back to Top