పచ్చచొక్కాల పాలనను తరిమికొడదాం

  • జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం
  • రాజన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం
  • బాబు-కరువు అవిభక్త కవలలు
  • మూడేళ్లుగా రాష్ట్రంలో అవినీతి, అరాచకాల పాలన 
  • విచ్చలవిడిగా దోచేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా ఫైర్
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని నగరి శాసనసభ్యురాలు ఆర్‌.కె.రోజా ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో  సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కంచికచర్ల మండల పరిధిలోని పలు గ్రామాలలో నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మారకార్థం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రోజా మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకుంటూ, దాచుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, వర్షాలు సక్రమంగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు.  

చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోందని, నాటి నుంచి రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలంటూ నానా హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తి అసమర్థ పాలన సాగుతోందని చెప్పారు. శవాల మీద చిల్లర ఏరుకున్నట్టు రెయిన్ గన్ ల పేరుతో చంద్రబాబు 260 కోట్లు దోచుకున్నాడని రోజా మండిపడ్డారు.  దివంగత వైయస్సార్‌ 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని తన గొప్పగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇక్కడి సమస్యలు పరిష్కరించడం చేతకాని దద్దమ్మ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పులివెందులకు నీరిస్తానని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జగన్ గురించి మాట్లాడే అర్హత దేవినేనికి లేదని అన్నారు. మళ్లీ వైయస్ జగన్ గురించి దేవినేని వేలి ఎత్తి మాట్లాడితే త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది రైతులు, చేతికొచ్చే పంటలు. కానీ రాష్ట్రంలో బాబు ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి, అరిష్టం, అరాచకంతో రైతులను సర్వనాశనం చేసి గ్రామాల్లో పండుగకళ లేకుండా చేశాడని రోజా మండిపడ్డారు. రైతులకు, రైతు కూలీలకు సంతోషం లేకుండా చేసిన నీతిమాలిన నాయకుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రైతు, రైతు గొప్పతనం గురించి తెలిసిన నాయకుడు వైయస్ఆర్ అని, అందుకే అన్ని రకాలుగా అండదండగా ఉండి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాడని చెప్పారు. కానీ వ్యవసాయమే దండగన్న ముఖ్యమంత్రిని బాబునే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. మీ అందరికీ రుణమాఫీ జరిగిందా అని రోజా అడగగా లేదు అని స్థానిక ప్రజలు మొరపెట్టుకున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బాబు  అబద్ధాలను నిజాలుగా నమ్మించి ఏవిధంగా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటాడో గత ఎన్నికల్లోనే చూశామన్నారు. రాజధాని పేరుతో మూడు పంటలు పండే భూముల్ని లాక్కొని రైతన్నకు తిండి లేకుండా చేశాడని బాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. Back to Top