సమైక్యంపై రాష్ట్రపతికి అఫిడవిట్లిద్దాం: జగన్

హైదరాబాద్ 20 డిసెంబర్ 2013:

రాజకీయ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలంతా ఏకమై, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర రాజధానిలోనే ఉన్నందున ఆయనకు ఇక్కడే వాటిని అందజేయవచ్చన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాను చివరి నిముషం వరకూ పోరాడతానని స్పష్టంచేశారు. గురువారం సాయంత్ర ఆయన లోటస్ పాండ్ నివాసంలో మీడియాతో మాట్లాడారు.

ఇలా సమర్పించిన అఫిడవిట్లు అప్రజాస్వామికంగా సాగుతున్న విభజన ప్రక్రియకు ఆటంకంగా నిలుస్తాయని తెలిపారు. టీ బిల్లుపై అసెంబ్లీ ఓటు చేసినా చేయకపోయినా ఇవి ఆశించిన ప్రయోజనాన్ని చేకూరుస్తాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు తాము ఎంత ఘనులో తేలిపోయింది కాబట్టి ఇక ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అఫిడవిట్లపై సంతకాలు చేయాలని సూచించారు.
రాష్టాన్ని సమైక్యంగా ఉంచడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు పార్టీతో అనుబంధానికి అతీతంగా మెలగాల్సిన తరుణమిదని శ్రీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రెండు ప్రాంతాలమీద రెండు కాళ్ళు పెట్టి చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. విభజనని అడ్డుకుంటానని బీరాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టి ముసాయిదా బిల్లు వచ్చిన 17 గంటలలో అసెంబ్లీకి పంపేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా అఫిడవిట్లపై సంతకం చేయాలని ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్ లోనే ఉన్న రాష్ట్రపతికి ఆ అఫిడవిట్లను సమర్పిద్దామని తెలిపారు.

రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు ఆందోళన కలిగిస్తున్న అంశాలపై చర్చ సాగకుండానే అసెంబ్లీ, పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడటమే దీనిని తార్కాణమని శ్రీ జగన్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిరోజు విభజన అంశాన్ని ప్రస్తావించామన్నారు. దీనిద్వారా యావద్దేశ దృష్టినీ ఆకర్షించగలిగామన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజించడం వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని కూడా తెలియజెప్పగలిగామని పేర్కొన్నారు. వాయిదా తీర్మానం ఇచ్చామనీ, అవిశ్వాస తీర్మానాన్ని సైతం ప్రతిపాదించామనీ వాటికి సమాజ్ వాదీ, శివసేన మద్దతు పలికాయనీ తెలిపారు. అప్రజాస్వామిక విభజన నిర్ణయంపై ఆ పార్టీలు కూడా వాయిదా తీర్మానాలిచ్చాయన్నారు.  టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కానీ, సభ్యులు కానీ దీనికి మద్దతు పలకకపోవడం శోచనీయమని చెప్పారు. టీడీపీ సభ్యులు నలుగురిలో ఇద్దరు తమతో కలవగా, టీడీపీ సభా నాయకుడు నామా నాగేశ్వరరావు తమపై విమర్శలు చేశారన్నారు.
మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తేవడానికి మేము లోక్ సభ వెల్ లోకి వెళ్ళగా కొంతమంది కాంగ్రెస్, టీడీపీ సభ్యులు తమతో కలిశారనీ, టీడీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు తమను ఎగతాళి చేశారని చెప్పారు.

తాము అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడమే కాక, ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడా పలికామని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎలగెత్తి చాటాలనుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇద్దరు టీడీపీ ఎంపీలు తమతో రాకపోవడం తప్పుడు సంకేతాలు పంపుతుందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా బాధాకరమని శ్రీ జగన్ చెప్పారు.

అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుల వ్యవహార శైలి కూడా ప్రశ్నార్థకంగా ఉందన్నారు. రెండు బిఏసీ సమావేశాలకూ టీడీపీ శాసన సభా పక్ష నాయకుడు అసెంబ్లీలోని తన చాంబరుకే పరిమితమయ్యారని తెలిపారు. ఆ పార్టీ సభ్యులు ప్లకార్డులు చూపుతూ భిన్నమైన డిమాండ్లతో వ్యవహరించారని చెప్పారు. చర్చ ప్రారంభమైందని చెప్పడానికి మినహా ఆయన హాజరు ఎందుకు పనికిరాని విధంగా ఉందన్నారు.

మరోవంక ముఖ్యమంత్రి కిరణ్ టి బిల్లును స్పీకరుకు సజావుగా పంపేదుకు సహకరించారని విమర్శించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రి గానీ, ప్రతిపక్ష నేత గానీ స్పీకరు గానీ సభలో లేని విషయం ఇక్కడ గమనార్హమని పేర్కొన్నారు. ప్రశ్నార్థకమైన వ్యవహారశైలితో ఉన్న ఈ ఇద్దరు నేతలను విడిచిపెట్టి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఎమ్మెల్యేలు తమ చిత్తశుద్ధి మేరకు అఫిడవిట్లపై సంతకాలు చేసి, రాష్ట్రపతికి సమర్పించాలని శ్రీ జగన్ కోరారు. రాష్ట్రం ముక్కలైతే బలహీనపడుతుందన్నారు. మూడో ఆర్థిక శక్తిగా ఉన్న రాష్ట్రం ముక్కలైతే ఒకటి ఎనిమిదో స్థానానికీ, మరొకటి 13వ స్థానానికి దిగజారతాయన్నారు. 70శాతం జనాభా విభజన వద్దని కోరుకుంటుంటే కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది కాబట్టి 70 రోజుల్లో కాంగ్రెస్ ఇంటికెళ్లిపోతుందన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉందని శ్రీ జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. అలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరిస్తామనే పార్టీకీ, నేతకి మాత్రమే మద్దుతపలుకుతుందని ఆయన పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top