అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేద్దాం

కర్నూలు: అవినీతి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని అంతం చేద్దామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పిలుపునిచ్చారు. ఆలూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ శనివారం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్లీనరీని ప్రారంభించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..టీడీపీ పాలనలో అవినీతి ఏరులై పారుతుందన్నారు. సంక్షేమపథకాలు పేదల దరి చేరడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ పార్టీలకు అతీతంగా అందేవని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టడంతో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుళ్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.


Back to Top