తెలంగాణకు ముందు దళితుల సమస్యలు తేల్చండి

హైదరాబాద్ 23 ఆగస్టు 2013:

దళితుల సమస్యలను తేల్చిన తర్వాతనే నేతలు తెలంగాణ విభజనపై మాట్లాడాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్  డిమాండ్ చేశారు. తెలంగాణ పేరు మీద మా అభివృద్ధిని కుంటుపరిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. దళితుల సమస్యలు ఎలా తీరుస్తారో చెప్పిన తర్వాతనే తెలంగాణ విభజన గురించి ఆలోచించాలని ఆయన కోరారు. తెలంగాణ వస్తే దొరల రాజ్యం మళ్ళీ వస్తుందన్న సీపీఎమ్ నేత రాఘవులు ప్రకటనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సూర్యప్రకాశ్ చెప్పారు.

అది కాంగ్రెస్ అభిప్రాయం మాత్రమే
కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది తెలంగాణకు సంబంధించిన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తంచేసిందని  చెప్పారు. ఇది కేంద్రానికి సంబంధించిన ముసాయిదా గానీ, ప్రకటన గానీ కాదని స్పష్టంచేశారు. అలాంటి దాఖలా కూడా లేదని ఆయన పేర్కొన్నారు. కానీ, తెలంగాణ ఉద్యమకారులుగా చెప్పుకుంటున్న కొందరి భాష చాలా తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. వారు తమ వ్యాఖ్యలతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీ రామారావుగారు అధికారంలోకి రాకపూర్వం తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ(ఫ్యూడలిజం) వేళ్లూనుకుని ఉందని చెప్పారు. శ్రమ చేసిన దళితులకు వారి కష్టాన్ని గుర్తించి కూలి ఇచ్చిన పరిస్థితి అప్పట్లో లేదన్నారు. ఏడాదికో.. రెండేళ్ళకో ఓ సారి బిచ్చం పేరు మీద ధాన్యం అది కూడా తాలు గింజలను ఇచ్చేవారన్నారు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నంతకాలం పరిస్థితి మారిందనీ, చంద్రబాబు ముఖ్యమంత్రయిన తర్వాత మళ్లీ పాత పరిస్థితులే నెలకొన్నాయనీ వివరించారు.

మహానేత హయాంలో దళితులకు అన్ని సౌకర్యాలు
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అధికారంలోకి వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో దళితులకు అన్నీ సమకూరాయని సూర్యప్రకాశ్ తెలిపారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం పడకేసిందని చెప్పారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలన్నీ కుంటుపడ్డాయన్నారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో తెలీదు గానీ... ఈ పథకాలు మరింత కుంటుపడడం ఖాయమన్నారు. ఫ్యూడల్సుగా వ్యవహరిస్తున్న దొరలు తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం వెలువడిన వెంటనే గడీలలోకి వాటికి సున్నాలు కొట్టి.. అక్కడే ఉంటూ పంచాయతీలు పెడుతున్నారనీ, దళితులను అణిచేస్తున్నారనీ ఆయన చెప్పారు. దీనిపై కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఏం చెబుతారని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబం సంతృప్తి చెందితే చాలా!
తెలంగాణలో అందరూ సంతృప్తిచెందాలా లేక కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతృప్తి చెందాలా ఆలోచించుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలోని దళితులు, ఎస్టీలు, మైనార్టీలు భయానికి గురవుతున్న వాతావరణం నెలకొందన్నారు. ఈ దొరలు ఇప్పుడు అధికారంలోకి వస్తే చరిత్ర పునరావృతమవుతుందనే ఆందోళన అందరిలో ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, జేఏసీ నాయకులు మాట్లాడుతున్న భాష దుర్మార్గంగా ఉందన్నారు. కాకా హొటళ్లు పెట్టుకోండి రక్షణ కల్పిస్తామని చెప్పడాన్ని సూర్యప్రకాశ్ ఎద్దేవా చేశారు. రక్షణ ఇవ్వడానికి  వీళ్లెవరని ప్రశ్నించారు. దానికో రాజ్యాంగం, దాన్ని అమలుచేసేందుకో వ్యవస్థ ఉన్నాయన్న విషయాన్ని వారు మరిచారా అని నిలదీశారు.  అడ్డుకుంటాం అనే పదం దొరల పరిభాషనీ, దీన్ని తాము వ్యతిరేకిస్తామనీ చెప్పారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం కోసం తమ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేస్తున్న దీక్షపై సాగుతున్న దుష్ర్పచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విజయమ్మ గారి దీక్ష ముఖ్యంగా తెలంగాణకు, అందులోని దళితులకు వర్తిస్తుందని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చినా రాకున్నా మాక్కావలసింది మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడమేనని సూర్యప్రకాశ్ నిక్కచ్చిగా చెప్పారు.

Back to Top