బాధితులకు అండగా ఉంటాం

 
ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏం న్యాయం చేసింది
యాజమాన్యానికి కొమ్ముకాస్తూ.. ఉత్తమ అవార్డులా?
బాధితులకు న్యాయం చేసేందుకు అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ
11 మంది సభ్యులను నియమించిన వైయస్‌ జగన్‌
రేపు విజయవాడ కార్యాలయంలో మొట్టమొదటి సమావేశం

విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలబడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. 2014లో జరిగిన అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది బాధితులు ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 లక్షలకుపైచిలుకు ఉన్నారన్నారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణం బయటకువచ్చిన తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతిపక్షం ఇప్పటికీ ఉద్యమం చేస్తూనే ఉందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో, బయట నిలదీశారన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను దొబ్బేయాలనే ఆలోచనతో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును జననేత ప్రస్తావించారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఏ గ్రామానికి వెళ్లినా అగ్రిగోల్డ్‌ బాధితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధను చెప్పుకుంటున్నారన్నారు. 

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా నిలబడేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 11 మంది సభ్యులతో అగ్రిగోల్డ్‌ బాసట కమిటీని నియమించారని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. రేపు ఉదయం విజయవాడ పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో బాధితుల ఇబ్బందులు, కార్యచరణ అంశాలపై ప్రస్తావించనున్నామన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మొదటిసారిగా అగ్రిగోల్డ్‌ బాధితుల సమావేశం నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 మంది సభ్యులే కాకుండా పార్టీ ముఖ్యనేతలు కూడా హాజరవుతారన్నారు. 

ఇప్పటికీ రాష్ట్రంలో బాధితులు 200ల మందికిపైగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారని, అయినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ బాధితుల పక్షాన విజయవాడలో నిరాహారదీక్ష చేసిన సమయంలో, అసెంబ్లీలో నిలదీసినప్పుడు చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రకరకాల నిబంధనలు పెట్టి బాధిత కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు పలువురు అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌లపై కేసులున్నా అరెస్టులు చేయకుండా ప్రభుత్వం, సీఐడీ వారికి కొమ్ముకాస్తుందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకొని ప్రభుత్వం రూ. 12 వందల కోట్లు ఇస్తే 14 లక్షల మంది బాధితలకు ఊరటగా ఉంటుందన్నారు. బాధితులను ఆదుకునే చిత్తశుద్ధి లేదు కానీ.. ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. అంతే కాకుండా అగ్రిగోల్డ్‌ సంస్థకు చంద్రబాబు ఉత్తమ అవార్డులు అందజేస్తున్నారని, అంటే ప్రభుత్వం, అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఒప్పందంలో భాగంగానే దుశ్చర్యలు జరుగుతున్నాయన్నారు. 
 
Back to Top