భూ అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం

బాబు ఆదేశాల ప్రకారమే అమ్మకానికి పెట్టారు
సదావర్తి సత్రం భూముల ఆక్షన్ ను రద్దు చేయాలి
డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో, ఎవరి చేతులు మారాయో
కుంభకోణమంతా బయటకు వస్తుంది
భూదందాను ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం
వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్ః చంద్రబాబు ఆదేశాల ప్రకారమే సదావర్తి సత్రం భూముల అమ్మకాలు జరిగాయని వైయస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ చైర్మన్ ధర్మాన ప్రసాదరావు తేల్చిచెప్పారు. స‌దావ‌ర్తి భూములు రెండు రాష్ట్రాల‌కు సంబంధించిన ఆస్తి అని ఆయ‌న పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు ప్రాంతం, త‌మిళ‌నాడులోని త‌లంబ‌పూర్ ప్రాంతాల్లో స‌దావ‌ర్తి స‌త్రం భూములున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. రెండు ప్ర‌భుత్వాలకు సంబంధించిన వ్య‌వ‌హారాన్ని క్యాబినెట్‌, గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లకపోవడం దారుణమన్నారు. స‌దావ‌ర్తి స‌త్రం భూముల విక్ర‌యాల్లో జరిగిన అక్రమాలపై వాస్తవాలను తెలుసుకునేందుకు వైయస్సార్సీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ.... అధ్యక్షులు వైయస్ జగన్ కు నివేదిక అందజేసింది. 

ఈసందర్భంగా హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ... హిందువుల‌కు చెందిన ఆస్తుల‌ను ప‌రిర‌క్షించ‌డంలో, న్యాయబద్దంగా వ్య‌వ‌హరించ‌డంలో టీడీపీ విఫలం చెందింది అన‌డానికి స‌దావ‌ర్తి భూముల అమ్మ‌కాలే నిద‌ర్శ‌న‌మన్నారు. స‌దావ‌ర్తి స‌త్రం ప్రాంతానికి ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్ ముఖ్యమంత్రికి లేఖరాయడంతో బాబు ఆదేశాలిచ్చారన్నారు. ట్ర‌స్టుల‌కు స‌బంధించిన ఆస్తుల‌ను విక్ర‌యించే ముందు అధికార ప్ర‌భుత్వం....  చ‌ట్టాల‌కు అనుగుణంగా ఉందా లేదా అనేది స‌రి చూసుకోవాల్సి ఉంటుందన్నారు.  స‌దావ‌ర్తి భూముల‌పై జ‌రిగిన అవినీతిని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రికి లేఖ ద్వారా తెలియ‌జేయ‌నున్నార‌ని ధర్మాన తెలిపారు.  వైయస్ జగన్ కు ప్రాథమిక నివేదిక మాత్రమే అందించామని, తుది నివేదికలో అన్నీ బయటకొస్తాయని ధర్మాన స్పష్టం చేశారు. 

భూములు ఎవ‌రివి..?
స‌దావ‌ర్తి స‌త్రానికి సంబంధించిన భూములు రాజా వెంక‌ట్రాది నాయుడుకు చెందిన‌వ‌ని ధర్మాన పేర్కొన్నారు. పేద బ్ర‌హ్మ‌ణులకు విద్య‌ను అందించ‌డానికి రాజా వెంక‌ట్రాది నాయుడు కేటాయించార‌న్నారు. అలాంటి భూముల‌ను పేద బ్ర‌హ్మ‌ణుల విద్య కోసం ఉప‌యోగించ‌క‌పోతే వారి ల‌క్ష్యాల‌ను నీరుగార్చిన‌ట్ల‌వుతుంద‌ని ధ‌ర్మాన ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రూ. 5 వేల కోట్ల ఆస్తి, 450 ఎక‌రాల భూమి  చెన్నై ఐటీ కారిడార్‌కు అనుకొని ఉంద‌ని, ఇలాంటి పెద్ద మొత్తాన్ని అమ్మేసే ముందు క్యాబినెట్‌, న్యాయ విభాగం అభిప్రాయాల‌ను సేక‌రించాల్సి ఉంటుంద‌న్నారు. 

నిబంధ‌న‌లు పెట్టి పాటించ‌రేం...
ఒక హిందు చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ ఆస్తులను ప్ర‌భుత్వాలు అమ్మేసే క్ర‌మంలో ట్రస్టు స్థాపించినప్పుడు పెట్టుకున్న ల‌క్ష్యాలు అవ‌స‌రం లేదనుకున్న క్ర‌మంలో... 2015లో జీవో 424 టెండ‌ర్ క‌మ్ ఆఫ్ష‌న్ పెట్టాల‌ని బాబు స‌ర్కారే నిబంధ‌న పెట్టింద‌న్నారు. ఇప్పుడు వారే ఆ నిబంధ‌న‌ను పాటించ‌డం లేద‌ని ధ‌ర్మాన నిప్పులు చెరిగారు.  ఇలాంటి ఆస్తుల‌ను ఫెయిల్ చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకునే ముందు హైకోర్టు అనుమ‌తి తీసుకోవాల్సి ఉన్నా టీడీపీ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమ‌తి తీసుకోలేద‌ని విమ‌ర్శించారు. ఈ టెండ‌ర్ విధానం పెడితే మ‌ల్టినేష‌న‌ల్ కంపెనీలు వ‌స్తాయ‌నే భ‌యంతోనే ఈ టెండ‌ర్ విధానాన్ని పెట్ట‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. టెండ‌ర్‌లో ఉన్న‌వారందరూ బాబు స్నేహితులు, బంధువులుగా ఉన్నవారేన‌న్నారు. 

రైతువారిప‌ట్టా ఇవ్వ‌లేదు...
స‌దావ‌ర్తి స‌త్రం భూముల విక్ర‌యాలు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌లేద‌ని, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రైతువారిప‌ట్టా ఇవ్వ‌లేద‌ని, భూముల‌ను అప్ప‌గించాల్సింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. టెండ‌ర్‌లో ఎనిమిది మందిలో ఆరుగురు పేరును ఓకే చేశార‌న్నారు. రిజిస్ట‌ర్ మార్కెట్ విలువ ప్ర‌కారం ఎక‌రం రూ. 6 కోట్ల 50 ల‌క్ష‌లు ఉండ‌గా, ప‌బ్లిక్ ఆప్ష‌న్‌లో క‌నీసం రూ. 50 ల‌క్ష‌లు ఉండాల్సి ఉండ‌గా కేవ‌లం రూ. 27 ల‌క్ష‌ల‌కు ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. 

కుంభకోణమంతా బయటకొస్తుంది
స‌త్రం భూముల విక్ర‌యాల‌పై అన్ని రాజ‌కీయ పార్టీలు వ్య‌తిరేకించినా ముఖ్య‌మంత్రి ఎందుకు స్పందించ‌డం లేద‌ని ధ‌ర్మాన నిల‌దీశారు.  ఈ భూముల అమ్మ‌కాల‌పై రామాంజ‌నేయులు వివ‌ర‌ణ అవ‌స‌రం లేద‌ని, దీనిపై బాబు స‌ర్కార్ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.  డబ్బులు ఎక్కడివి, ఎవరి చేతులు మారాయో కుంభకోణమంతా బయటపడుతుందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేయడంతో పాటు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సదావర్తి భూముల విష‌యాన్ని  ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top