ముఖ్యమంత్రి కనుసన్నల్లో భూ కబ్జాలు

  • విలువైన భూములపై వాలుతున్న పచ్చ రాబంధులు
  • చంద్రబాబు అవినీతి, అక్రమాలను అడ్డుకుంటాం
  • టీడీపీ భూ దురాక్రమణలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాం
  • ఈనెల 22న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేస్తున్నాం
  • ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ 
విశాఖపట్నంః రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములున్నచోటల్లా ముఖ్యమంత్రి సహా మంత్రులు, టీడీపీ నాయకులు రాబందుల్లా వాలుతున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే విశాఖలో లక్ష ఎకరాలు భూ కబ్జా జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. మాట్లాడితే నేను సీనియర్ ని, నాకంటే సీనియర్ లు లేరని చంద్రబాబు ఆయనంతట ఆయన చెప్పుకోవడం తప్ప...అది చేతల్లో ఎక్కడా కనబడదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఎవరిని కదిలించినా...తమ ప్రాంత ఇబ్బందులు, దోపిడీలు, దౌర్జన్యాలు, ప్రభుత్వ అవినీతి గురించే చెబుతున్నారన్నారు.  టీడీపీ భూ దురాక్రమణలకు వ్యతిరేకంగా న్యాయం పోరాటం చేస్తామని బొత్స స్పష్టం చేశారు. దానిలో భాగంగానే ఈనెల 22న విశాఖ కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ ధర్నాలో తమ అధినేత వైయస్ జగన్ కూడ పాల్గొంటారని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు రికార్డులు పోయాయని కలెక్టర్ చెబుతున్నారంటే రాష్ట్రంలో పాలన ఏవిధంగా ఉందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ భూ దందాలను తాము నిలదీస్తుంటే అభివృద్ధికి ఆటంకమంటూ నిందలు వేస్తూ చంద్రబాబు తమపై ఎదురుదాడికి దిగుతున్నాడని బొత్స ఫైర్ అయ్యారు. తాము అభివృద్ధికి ఏనాడు వ్యతిరేకం కాదని, ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు మాత్రమే తాము వ్యతిరేకమని బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు.  ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు సంచులు మోసిన వారికి రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్న చంద్రబాబు విధానాలకు తాము వ్యతిరేకమని బొత్స అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, టీడీపీ నాయకులు అధికారులపై దాడులకు తెగబడుతున్న దానికి తాము వ్యతిరేకమని బొత్స చెప్పారు. బోగాపురంలో, తిరుపతిలో పెట్టే ఎయిర్ పోర్టుకు తాము వ్యతిరేకం కాదని, దాని పేరు చెప్పుకొని వేలాది ఎకరాల్ని సమీకరణ చేసి మీ తొత్తులకు కట్టబెట్టడానికి చేస్తున్న నీ ప్రయత్నానికి తాము వ్యతిరేకమని చంద్రబాబుపై బొత్స నిప్పులు చెరిగారు. 

అమరావతిలో స్టార్ హోటల్స్,  పెద్దనగరాలు క్రియేట్ చేయడానికి ఓపెన్ బిల్డింగ్ కు టెండర్లు పిలిస్తే ఎవరూ రావడం లేదని ...ప్రభుత్వమే వారికి కేటాయింపులు చేస్తూ మరో దోపిడీకి తెరలేపుతుందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వైయస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. అమరావతిలో ఇంకో మూడు గ్రామాల్లో 15వేల ఎకరాల భూదందాకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, ప్రభుత్వ భూములు దోచుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కార్యక్రమాలు చేపడుతామన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా చంద్రబాబు చేస్తున్న అరాచకాల్ని అడ్డుకుంటామన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే తప్ప రాష్ట్రాభివృద్ధి జరగదని తాము కోరుకుంటుంటే...చంద్రబాబు కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడి ప్యాకేజీలకు మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా కోసం ఇప్పటికే తమ నాయకుడు వైయస్ జగన్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడారని... హోదాయే సంజీవని, దానికే తమ మద్దతు అని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఇక వెల్లంపల్లి ఇంటిపై టీడీపీ నేతల దాడిని బొత్స పిరికిపందల చర్యగా అభివర్ణించారు. వారికి దమ్ముంటే ఆలీబాబా 40 దొంగల్లాగ రాష్ట్రాన్ని దోచుకుతించున్న వాళ్ల ఇంటిముందు ధర్నా చేయాలన్నారు.  ప్రశ్నించిన ప్రతివారిపై దాడులకు తెగబడుతామనే విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఈ చర్యను ముఖ్యమంత్రి సమర్థిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. 


తాజా ఫోటోలు

Back to Top