చంద్ర‌బాబు భూ దోపిడీ

తిరుప‌తి:  రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కారు  దోపిడీ పెరిగింది. గ‌డిచిన రెండేళ్లలో రూ. 1.5 ల‌క్ష‌ల కోట్ల అవినీతి చోటు చేసుకుంది. పాల‌న గాడి త‌ప్పింది. అభివృద్ధి పూర్తిగా ప‌డకేసింది. రైతులు, కార్మికులు, డ్వాక్రా మ‌హిళ‌లు బాబు మోసాల‌కు బ‌ల‌య్యారు. రాష్ట్ర‌మంతా దోపిడీ వ్య‌వ‌స్థ వేళ్లూనుకుంటోంద‌ని పుంగ‌నూరు ఎమ్మెల్యే, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పాల‌క ప‌క్షంపై ధ్వ‌జమెత్తారు. పెద్దిరెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం అనంత‌రం భారీ ప్ర‌జా బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో చంద్ర‌బాబు భూ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింద‌న్నారు. ఇదే బాట ప‌ట్టిన మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కూడా ఆయ‌న త‌న‌యుడితో క‌లిసి నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల భూముల‌ను స్వాధీనం చేసుకోవ‌డం అధికార పార్టీ దౌర్జ‌న్యానికి ప‌రాకాష్ట‌గా క‌నిపిస్తోంద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

 వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ ప్ర‌భుత్వం పేద‌ల నుంచి బ‌ల‌వంతంగా గుంజుకున్న భూముల‌న్నింటినీ తిరిగి అప్ప‌గిస్తామ‌న్నారు. పార్టీ నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న మాట‌గా ప్ర‌జ‌ల‌కు చెప్ప‌మ‌న్న‌ట్లు ప్ర‌జ‌ల క‌రతాళ ధ్వ‌నుల మ‌ధ్య పేర్కొన్నారు. అధికారం ఉంద‌ని ప్ర‌జ‌లు, వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల‌పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయిస్తే చూస్తూ ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని పెద్దిరెడ్డి హెచ్చ‌రించారు. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డటం మంత్రి బొజ్జ‌ల‌కు ప‌ద్థతి కాద‌ని హిత‌వు చెప్పారు. తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు, గంగాధ‌ర‌నెల్లూరు ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి, బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి ప్ర‌భృతులు ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగ ఎంపీపీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, న్యాయ‌వాది ప‌ట్టాబి, ఏర్పేడునేత శ్రీ‌రాములురెడ్డి త‌దిత‌రులు పెద్దిరెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
Back to Top