భూ సేకరణ పెద్ద బెదిరింపు


ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడుకి ప్రజల్ని బెదిరించటం బాగా వచ్చు. ఆయన బాటలోనే ఆయన మంత్రులు
చెలరేగిపోతున్నారు. అందుకే రాజదాని ప్రాంతంలో భూసేకరణ చేసేస్తామని తెగ
బెదిరిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని పచ్చ మీడియా కూడా భూ సేకరణ
వచ్చేస్తుంది, రైతుల కొంప ముంచేస్తుంది అని ప్రచారం చేసేస్తుంది.

 

ఎన్డీయే ప్రభుత్వం భూ సేకరణ
చట్టానికి సవరణ చేసేందుకు తెగ ప్రయత్నించింది. కానీ అది సాద్యం కాలేదు. రైతుల
నోట్లో మట్టి కొట్టే ఈ సవరణ కు పార్లమెంటులో ఆమోదం దొరకలేదు. దీంతో దీన్ని అటక
ఎక్కించింది. అంటే అలనాడు యూపీఏ రూపొందించిన భూ సేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం
ముందడుగు వేయాలి.

కానీ ఆ చట్ట ప్రకారం చూస్తే
రైతులకు చాలా రక్షణలు ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక సర్వే గురించి ప్రధానంగా
చెప్పుకోవాలి. బలవంతంగా భూములు లాక్కోవాలంటే అక్కడ సామాజిక సర్వే జరగాలి. ఈ
భూసేకరణ తో అక్కడ సామాజికంగా ఎటువంటి ప్రభావం ఉంటుంది, జీవ వైవిధ్యం ఏ రకంగా
ఉంటుంది. జీవన ప్రమాణాలు ఏ రకంగా మార బోతున్నాయి, పర్యావరణ మార్పులు ఏమిటి
అనేదాన్ని అధ్యయనం చేయాలి. దీంతో పాటు భూముల యజమానుల నుంచి అనుమతి తీసుకోవాలి.
సేకరిస్తున్న ప్రాంతంలో 70 శాతం భూముల యజమానులు అనుమతిని తెలియచేయాలి.

అంతకన్నా ముఖ్యమైనది ఆహార
భద్రతకు సంబంధించినది. బహుళ పంటలు పండే భూముల్ని కిరాతకంగా లాక్కోవటం కుదరని పని. దేశ
భద్రతకు, ప్రక్రతి విపత్తుల నివారణ వంటి అవసరాలకు తప్పిస్తే దీనికి మినహాయింపు
రావటం కష్టం. ఒక వేళ బలవంతంగా లాక్కోవాలి అంటే అంతకు మేర పరిహారం చెల్లించాలి, అంతే
మొత్తంలో పంట పొలాల్ని అభివ్రద్ది చేయాలి, అందుకు సంబంధించిన నిధిని ఏర్పాటు
చేయాలి. ఇవన్నీ జరిగేవి కావు.

అందుకే భూ సేకరణ చట్టం
ప్రయోగించటం సాధ్యం కాదని చంద్రబాబు సహా ప్రభుత్వ పెద్దలు అందరికీ తెలుసు. కానీ, ఈ
చట్టాన్ని ప్రయోగిస్తున్నామని బెదిరించి రైతుల నుంచి భూములు లాక్కోవాలన్నది
చంద్రబాబు ఉద్దేశం అని సామాజిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Back to Top