అవసరానికి మించిన భూసేకరణ అక్రమమే

తుని రూర‌ల్ః పేద రైతుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా అవ‌స‌రాల‌కు మించి ప్రభుత్వం అక్రమంగా భూసేకరణ చేస్తోంద‌ని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో తుని మండలం వి.కొత్తూరు పంచాయతీ రాజుపేట, కె.వెలంపేట, సీతయ్యపేట గ్రామాలకు చెందిన పలువురు బాధిత రైతులు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కలసి తమగోడును వినిపించారు. ఎన్నో భూములు ఉన్నప్పటికి పూర్వం పేదలకు ఇచ్చిన డీపట్టా భూములను లాక్కునేందుకు కుట్ర‌ప‌న్ని ప్రభుత్వం భూసేకరణకు నోటీసులు ఇచ్చిందని, నష్టపరిహారం ఎంత ఇస్తారో స్పష్టం చేయలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో పారిశ్రామిక వాడ‌కు 30 ఎకరాలు కావాలని వచ్చిన అధికారులు ఇప్పుడు ఐదు వందల ఎకరాలను సేకరించేందుకు నోటీసులు ఇచ్చారన్నారు. ఏడాదిగా అటువైపు రహదారులను విస్తరిస్తుంటే మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని సంతోషించామ‌ని కాని ఇలా  జీవనోపాధిపై దెబ్బ కొడతారని ఉహించలేదన్నారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ... కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలసి సమస్యను వివరించి, పరిష్కరిస్తాని బాధితులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 30 నుంచి 40 ఎకరాలను పారిశ్రామికవాడలకు భూసేకరణను ప్రభుత్వం చేస్తుందని, అందుకు భిన్నంగా తుని మండలంలో ఐదు వందల ఎకరాలను ఏ అవసరాలు కోసం భూసేకరణ చేస్తున్నారో తెలియజేయాలని కలెక్టర్‌ను కోరుతానన్నారు. 

తొండంగి మండంలో సేకరించిన వేలాది ఎక‌రాల  భూములు ఉండగా ఇక్కడ మళ్లీ భూసేకరణ చేయడం అక్రమమే అన్నారు. ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణులు జీవనోపాధి కోల్పొతారన్న విషయాన్ని కలెక్టర్‌కు వివరిస్తాన్నారు. చిన్నసన్నకారు రైతుల భూములను ప్రభుత్వం సేకరిస్తే వారు ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లాలో చెప్పాల‌ని  డిమాండ్‌ చేస్తానన్నారు. ప్రత్యామ్నాయ భూములను చూసుకోవాలన్నారు. భూసేకరణ చేయాల్సి వస్తే ముందుగా వారికి ఉపాధి అవ‌కాశాలు చూపాల‌న్నారు. . భూసేకరణలో తీసుకున్న భూములకు నష్టపరిహారం బహిరంగ మార్కెట్‌కు అనుగుణంగాను, కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తాన్నారు. అవసరమైతే బాధిత రైతుల వెంట ఉండి పోరాటం చేస్తానన్నారు. రైతుల అభ్యున్నతికి కృషి చేస్తాని హామీ ఇచ్చారు. వైయస్సార్‌ సిపి మండల కన్వీనర్‌ పోతల రమణ, బాధితులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top