రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల దోపిడీ

  • విదేశీ కంపెనీల మాటున లక్షల కోట్ల లూటీ
  • కోర్టు తప్పబట్టడంతో బాబు యూటర్న్
  • వైయస్‌ జగన్‌ పోరాటాన్ని అడ్డుకుంటే బాబు మూతికాలిపోద్ది
  • రాష్ట్రాన్నినాశనం చేయాలని చూస్తే సర్వనాశనం అయిపోతారు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చిప్పేగతి
  • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్‌: రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతిపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు.  రాజధాని నిర్మాణంలో విదేశీ కంపెనీలతో చేతులు కలిపి రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బాబు కుట్రలు పన్నారని అంబటి ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానం న్యాయబద్ధమైనదైతే హైకోర్టులో కేసును ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారని అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు. స్విస్ చాలెంజ్‌ విధానం ద్వారా సింగపూర్‌ కంపెనీలకు భూమిని కట్టబెట్టి దాని మాటున బాబు, ఆయన తాబేదారులు  లక్షల కోట్లు సంపాదించుకోవడాన్ని.... కోర్టు తప్పుబట్టడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని విమర్శించారు. 

రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాలను స్టార్టప్‌ ఏరియాగా విదేశాలకు కట్టబెట్టాలని చూశారని మండిపడ్డారు. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లోపాలున్నాయని కోర్టును ఆశ్రయించిన వారిని అభివృద్ధి నిరోధకులు, ఉగ్రవాదులు అని మాట్లాడిన సీఎం..హైకోర్టులో కేసును ఎందుకు వెనక్కు తీసుకున్నారని నిలదీశారు. 1691 ఎకరాల భూమిలో విదేశీ కంపెనీలు ప్లాట్లు వేసుకొని అమ్ముకోవడానికి రాష్ట్రం ప్రభుత్వ 13 వేల కోట్లు ఖర్చు చేస్తే, సింగపూర్‌ కంపెనీలు మాత్రం రూ. 300 కోర్చు చేయడం దుర్మార్గమన్నారు. దాంట్లో మన రాష్ట్రానికి 42 శాతం, విదేశాలకు 58 శాతం ఇంతకన్నా దోచుకునే విధానం ప్రపంచంలో ఇంకోటుందని ఎద్దేవా చేశారు. 58 శాతంలో మీకు, మీ కుమారుడు లోకేష్‌బాబుకు 50 శాతం వస్తాయా అని బాబును కడిగిపారేశారు. ప్రజల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి విదేశాలకు కట్టబెట్టడానికి సిద్ధమైందని ఫైరయ్యారు. 

స్విస్‌ చాలెంజ్‌పై బాబు మరో స్కెచ్‌
స్విస్‌ చాలెంజ్‌ విధానంతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తుందని, న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదని అంబటి విమర్శించారు. రాజధాని నిర్మాణం తమకు ఇవ్వాలని రెండు కంపెనీలు ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, ఎన్‌వీఎస్‌ ఇంజనీర్స్‌ సంస్థలు కోర్టును ఆశ్రయిస్తే ఈ విధానం తప్పని కోర్టు 54 పేజీలతో కూడిన ఉత్తరాన్ని ప్రభుత్వానికి అందజేసిందన్నారు. కోర్టు తప్పుబట్టడంతో ఏపీఐడీఈ (ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ డౌలప్‌మెంట్‌ ఎనేబిలింగ్‌ యాక్ట్‌)ను సవరించి న్యాయస్థానాలకు కూడా దొరకకుండా దోపిడీని కొనసాగించడానికి బాబు మరొక స్కెట్ వేశారని అంబటి ఆరోపించారు. పురపాలక శాఖామంత్రి నారాయణ స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఏ విధంగానైనా సరే రైతుల నుంచి లాక్కున్న భూములను సింగపూర్‌కు కట్టబెట్టి లక్షల కోట్లు దోచుకోవాలనే దుర్బుద్దితో ప్రభుత్వం యాక్ట్‌ విధానాలను కూడా మారుస్తోందని మండిపడ్డారు. ఇది అత్యంత ప్రమాదకరమని చంద్రబాబును హెచ్చరించారు. 1691 ఎకరాల్లో ప్లాట్లు చేసుకొని అమ్ముకోవడానికే తప్ప బాబుకు  రాజధాని నిర్మాణం చేయాలన్న చిత్తశుద్దే లేదన్నారు. ఇది ప్రజలు గమనించాలని సూచించారు. 

కోర్టు మొట్టికాయలతో బాబులో చలనం
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో దోపిడీ జరుగుతుందని గతంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ అధికారులకు లేఖలు రాశారని అంబటి గుర్తు చేశారు. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో సంతకాలు పెడితే అధికారులు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారని హెచ్చరించినట్లు చెప్పారు. ఆయినా ప్రభుత్వం శర్మ లేఖను పట్టించుకోలేదన్నారు. ఇదే మాట ప్రతిపక్షాలు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, కోర్టు మొట్టికాయలు వేయడంతో చలించిందని దుయ్యబట్టారు. విదేశీ కంపెనీలతో బేరమాడుకొని కంపెనీలతో కుమ్మకై కోట్లు కాజేయాలని చూస్తే రాజధాని నాశనం అవుతుందని, చంద్రబాబు కూడా సర్వ నాశనం అవుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా మనస్సు మార్చుకొని ప్రజారంజక పాలన చేయాలని డిమాండ్‌ చేశారు. వేరే మార్గంలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినా వాటిపై కూడా వైయస్‌ఆర్‌ సీపీ సవాలు చేస్తుందని హెచ్చరించారు.

వైయస్‌ జగన్‌కు వస్తున్న మద్దతుతో బాబుకు కడుపుమంట
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి యువత, నిరుద్యోగుల నుంచి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు కడుపుమండుతుందని అంబటి వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షనేత దగ్గరికి ఎవరు వెళ్లాలి... ఎవరు వెళ్ల కూడదనేది మీరే నిర్ణయిస్తారా? హోదా కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరికి కాకుండా మీ కుమారుడు లోకేష్‌ దగ్గరికి వెళితే ఏ రకంగా తయారవుతారో లోకమంతా తెలుసునని అంబటి బాబుకు చురక అంటించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బాబుకు కేవలం 5.25 లక్షల ఓట్ల తేడా మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బాబు యువభేరిలకు వెళ్లొద్దని చెబితే వినేవాళ్లు ఎవరే లేరని చెప్పారు. వైయస్‌ జగన్‌ పోరాటాన్ని అడ్డుకుంటే మూతి కాలుతుందని బాబుకు వార్నింగ్ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ...మంత్రిపదువులకు బదులు బాబు చిప్పచేతికిస్తాడని ఎద్దేవా చేశారు. పిల్లనిచ్చిన మామను, సొంత బావమరిదిని, తోటి అల్లుడిని మోసం చేసిన బాబు మిమ్మల్ని మాత్రం మోసం చేయకుండా ఎలా ఉంటాడని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సూచించారు. 
 
Back to Top