సీఎం,మంత్రులు స్పందించకపోవడం దురదృష్టకరం

  • రాజధాని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • పట్టించుకోని ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు
  • ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ నేత పార్థసారథి ఆగ్రహం
  • ఘటన స్థలికి బయలుదేరిన వైయస్ జగన్
విజయవాడ: రాజధాని కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగితే ఇంతవరకు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు స్పందించకపోవడం దురదృష్టకరమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ఈ ఘటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉదయమే స్పందించారని తెలిపారు. సంఘటన స్థలానికి ప్రతిపక్ష నేత బయలుదేరినట్లు పార్థసారధి చెప్పారు. 

పెనుగంచిప్రోలు సమీపంలోని మూలపాడు వద్ద మంగళవారం వేకువజామున కల్వర్టు ఢీకొని దివాకర్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా కొట్టిన సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఇది చాలా దారుణమైన సంఘటన అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు నిర్లక్ష్య దోరణీతో వ్యహరించడం, నిబంధనలు గాలికి వదిలివేయడంతో అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇలాంటి ఘటనపై ప్రభుత్వం కూడా కళ్లు మూసుకొంటుందని మండిపడ్డారు. ఇంతకట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా కూడా డివైడర్‌ను కొట్టుకుంటూ బస్సు వెళ్లిపోయిన తీరు గమనిస్తే భయం కలుగుతుందన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు ఆరు గంటలు అవుతుందని, ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోవాల్సిన చర్యలు  ఇక్కడ కనిపించడం లేదని విమర్శించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ  దుర్ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 
Back to Top