అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడుదాం

క‌ర్నూలు:  తెలుగు దేశం పార్టీ సాగిస్తున్న అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి హెచ్చ‌రించారు. శుక్ర‌వారం జిల్లాలోని బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ప్లీన‌రీ మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అత్య‌ధిక సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ముందుకు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా గౌరు వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో చంద్ర‌బాబు అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి రాష్ట్రానికి చెడ్డ‌పేరు తెచ్చార‌ని విమ‌ర్శించారు. బాబు చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుల‌కు త‌గిన గుణ‌పాఠం చెప్ప‌డం త‌థ్య‌మ‌న్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు, పక్కా గృహాలు ఇచ్చారన్నారు. మూడేళ్ల నుంచి బాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అర్హులను పక్కన పెట్టి టీడీపీ కార్యకర్తలకు పథకాలు కట్టబెడుతున్నారన్నారు. దీంతో పేదలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బీవై రామ‌య్య‌, నంద్యాల‌, శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు రాజ‌గోపాల్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top