కుమ్మక్కు కుట్రలతో అధ్వాన పాలన

యనమదల(నూజివీడు) 13 ఏప్రిల్ 2013:

టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధ్వానంగా పరిపాలన సాగిస్తున్నారని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని యనమదల గ్రామంలో శనివారం ఉదయం నిర్వహించిన రచ్చబండలో ఆమె మాట్లాడారు. బాబు లాగే తొమ్మిదేళ్ళూ అధికారంలో ఉంటానని కిరణ్ కలలు కంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కరవు వస్తోందన్నారు. చంద్రబాబు ఎనిమిదేళ్ళలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచితే.. కిరణ్ తన మూడేళ్ళ పాలనలో నాలుగుసార్లు పెంచారని శ్రీమతి షర్మిల తెలిపారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు పలికుంటే ఈపాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిఉండేదన్నారు. ఈ ధరల భారం ప్రజల నెత్తిన పడి ఉండేది కాదన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కయ్యి ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ప్రజలను నిలువునా ముంచేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజన్న రాజ్యం రావాలంటే బాబుకు, కిరణ్ కూ బాగా బుద్ధి చెప్పాలని సూచించారు. జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుందన్నారు.

బొత్సపై మహిళల మండిపాటు
రచ్చబండలో పాల్గొన్న మహిళలు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయన్న ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గ్రామాలకు వస్తే పథకాలు అందుతున్నదీ లేనిదీ తెలుస్తుందన్నారు. వైయస్ఆర్ హయాంలో అందిన పథకాలకూ ఈ ప్రభుత్వ హయాంలో అందుతున్న పథకాలకూ చాలా తేడా ఉందని కృష్ణవేణి అనే మహిళ చెప్పారు. వైయస్ఆర్ ఎన్ని నిధులు విడుదల చేస్తే అన్నీ డ్వాక్రా బృందాలకు అందేవనీ ఇప్పుడా పరిస్థితి లేదనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అభయహస్తం పథకానికి చట్టం చేయమని అడిగిన వెంటనే చేసిన ఘనత మహానేతదని ఆమె ప్రస్తుతించారు. దీని ఫలాలను అందుకోవలసిన పేదలు ఇంకా చాలామంది ఉన్నారనీ, ఇందుకు ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెడుతోందనీ ఆమె తెలిపారు. పథకాల ప్రయోజనాలు కిందిస్థాయిలో అందేవరకూ సరైన పర్యవేక్షణ కరవైందన్నారు. రుణాలు, పథకాలు అందుతున్నాయా లేదా అని బృందాల నేతలను హైదరాబాద్ పిలిపించి మరీ వైయస్ఆర్ అడిగేవారని చెప్పారు. ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం తప్ప అవి చేరుతున్నదీ లేనిదీ పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు.

కరెంటు అసలు ఉండటం లేదని కృష్ణవేణి ఆవేదన వ్యక్తంచేశారు. వానరాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియనట్లుగానే కరెంటు సరఫరా పరిస్థితి కూడా తయారైందని ధ్వజమెత్తారు. వానెప్పుడొస్తుందో వాతావరణ శాఖ చెబుతుందనీ, ప్రాణం ఎప్పుడు పోతుందో వైద్యులు చెప్పగలుగుతారనీ అంటూ కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ వదిలి గ్రామాలకు వస్తే వివరాలు తెలుస్తాయని ఆమె కోరారు.

Back to Top