కుమ్మక్కు కుట్ర అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం

హైదరాబాద్, 16 మార్చి 2013:

అవిశ్వాస తీర్మానం ఓడినప్పటికీ ప్రతిపక్షాలు నైతిక విజయం సాధించినట్లేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సీనియర్ నేత అయిన డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వల్లే కాంగ్రెస్ పార్టీకి వాకింగ్ ఫ్రెండూ, మేనమామ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీతో అయిన కుమ్మక్కు కుట్ర శాసన సభ సాక్షిగా బహిర్గతమైందని మైసూరా రెడ్డి చెప్పారు. అవిశ్వాసమనేది రెండు వైపులా పదును ఉన్న కత్తని ఆయన అభివర్ణించారు. మేం పెట్టిన అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోదేమో గానీ ప్రధాన పక్షం మాకు మద్దతు పలికి ఉంటే అది సాధ్యపడేదన్నారు. అవిశ్వాసం పెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం కనీసం మద్దతు కూడా తెలపకపోవడం శోచనీయమన్నారు. పైపెచ్చు తటస్థంగా ఉండాలని కోరుతూ తన పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిందన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం తొట్టతొలిదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపే ప్రతిపక్షం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఇది చాలదన్నట్లు ప్రజా సమస్యలను, మంత్రుల మధ్య లుకలుకలనూ కూడా కనీసం ఆ పార్టీ వేలెత్తి చూపలేదన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో అత్యధిక సమయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు వెచ్చించారని చెప్పారు. ప్రభుత్వ తప్పిదాలను ఖండించక పోవడాన్ని మద్దతు తెలపడంగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఇది ఓ రకంగా అధికార పక్షంపై విశ్వాసాన్ని ప్రకటించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం రెండేళ్ళుగా అసెంబ్లీ వేదికగా నిరూపితమవుతూనే ఉందని తెలిపారు.


సమాధానం చెప్పుకోలేని వ్యక్తిపై సభలో విమర్శలా

సభలో లేని, విమర్శించినా సమాధానం చెప్పుకోలేని వ్యక్తుల గురించి ప్రస్తావించకూడదన్నది నిబంధననీ, దీనిని అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలో ఉల్లంఘించారనీ మైసూరా రెడ్డి ధ్వజమెత్తారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు సభలో చక్కటి సమన్వయంతో వ్యవహరించాయని ఎద్దేవా చేశారు.     ఆరెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.


కోర్టు పరిధిలో ఉన్న చార్జిషీటును సభలో ఎలా చదవనిచ్చారు?
చార్జిషీటు దాఖలైన తర్వాత ఏ అంశమైనా కోర్టు పరిథిలోకి వెడుతుందనీ, దీనిని విచారించిన అనంతరం దోషా నిర్దోషా తేలుస్తుందనీ మైసూరా రెడ్డి చెప్పారు. అంటే అంతవరకూ ఈ అంశంపై ఎక్కడా మాట్లాడకూడదన్నారు. దీనిని విస్మరించిన టీడీపీ సభ్యులు సీబీఐ చార్జిషీటులోని అంశాలను సభలో ప్రస్తావించారనీ, స్పీకరు దీనిని కూడా కట్టడి చేయలేదనీ ఇది నిబంధనలకు విరుద్ధమనీ చెప్పారు. పైగా రికార్డుల నుంచి తొలగిస్తానని పదేపదే చెప్పారన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా విస్తృత రూపు సంతరించుకున్న ఈ రోజుల్లో అంతా ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇలాంటి అంశాలను రికార్డుల నుంచి తొలగించి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తీర్పు వెలువడకముందు చార్జిషీటు పబ్లిక్ డాక్యుమెంటు కాబోదని ఆయన స్పష్టంచేశారు.


అధికారపక్షం మైనారిటీలో పడిందనేది వెల్లడైంది

అవిశ్వాస తీర్మానం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్న అంశం బహిర్గతమైందని మైసూరారెడ్డి చెప్పారు. అవిశ్వాసం నెగ్గడానికి తగినంత సంఖ్యాబలం తమకు లేదనే విషయం తెలుసనీ, ప్రధాన ప్రతిపక్షం కలిసొస్తుందని భావించామనీ తెలిపారు.  ఈ ఎపిసోడ్‌లో ఎవరు ఎవరితో బేరసారాలాడారో కూడా వెల్లడైందన్నారు. రెండు పార్టీలనుంచి పంతొమ్మిది మంది విప్ ధిక్కరించడం బట్టి ఆయా పార్టీల వైఖరులపై అంతర్గతంగా వ్యతిరేకత ఉందన్న కూడా బయటపడిందన్నారు. మమ్మల్ని తోక పార్టీలన్న చంద్రబాబు ఇప్పుడు అధికార పక్షానికి తోకపార్టీగా మారిపోయారని ధ్వజమెత్తారు.


స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధం

స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని మైసూరా రెడ్డి చెప్పారు. నిబంధనల ప్రకారం తొలుత, ఎమ్.పి.టి.సి., జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహించి ఆపై పంచాయతీ ఎన్నికలు పెట్టాలనీ అందుకు మేము సంసిద్ధంగా ఉన్నామనీ వివరించారు. ఆ ఎన్నికలలో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందన్నారు.

Back to Top