కుమ్మక్కై కక్ష సాధిస్తున్నారు


ఢిల్లీ, 15 జనవరి, 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని అకారణంగా జైలులో పెట్టారని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సీబీఐతో కుమ్మక్కై శ్రీ జగన్మోహనరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీబీఐ తీరుకు నిరసనగా ప్రజల నుంచి సేకరించిన కోటీ 56 లక్షల సంతకాలను రాష్ట్రపతికి అందజేశారు.

      'జగన్ కోసం... జనం సంతకం' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా  ప్రజల నుంచి రెండు కోట్ల సంతకాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. శ్రీ జగన్మోహనరెడ్డి కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. కేవలం మూడు వారాలు కొనసాగిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య  స్పందన వచ్చింది. సేకరించిన సంతకాల్లో కోటీ యాబై ఆరు లక్షల సంతకాలను స్కాన్ చేసి సీడీలుగా మార్చారు.

      శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డికి అండగా నిలుస్తూ ప్రజలు చేసిన సంతకాల సీడీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం సాయంత్రం శ్రీమతి వైయస్ విజయమ్మ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిందితులకు 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని నిబంధనలు చెపుతున్నా సీబీఐ అడ్డుతగులుతోందని ఆరోపించారు. శ్రీ జగన్మోహన రెడ్డిని అకారణంగా గత 8 మాసాలుగా జైలులో నిర్భందించారని ఆవేదన వ్యక్తం చేశారు.

      న్యాయ స్థానాల మీద మాకు అపారమైన నమ్మకం ఉందని, ఆ న్యాయ స్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని శ్రీమతి విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా కోర్టులో శ్రీ జగ్మోమోహనరెడ్డి నిర్ధోషి అని ప్రజలు తేల్చారని, అందుకు సేకరించిన సంతకాలే రుజువు చేశాయన్నారు. శ్రీ జగన్మోహనరెడ్డి‌ది అక్రమ అరెస్టని సంతకాల రూపంలో ప్రజలు మరోసారి తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు. కేవలం మూడు వారాల్లో రెండు కోట్ల మేరకు సంతకాలు సేకరించడంపట్ల రాష్ట్రపతి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

      శ్రీ జగన్మోహనరెడ్డి కేసులో సీబీఐ ఏ విధంగా వ్యవహరిస్తుందో రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లామని, ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో శ్రీమతి వైయస్ విజయమ్మతోపాటు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు.

Back to Top