కృష్ణాజిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైల్‌రోకో

విజయవాడ : పెంచిన రైల్ చార్జీలను ‌వెంటనే తగ్గించాలన్న డిమాండ్‌తో కృష్ణా జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమించింది. జిల్లాలోని ఉప్పులూరు రైల్వేస్టేషన్ వద్ద‌కు శనివారంనాడు పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొద్దిసేపు ధర్నా చేసి, అనంతరం రైల్‌రోకో నిర్వహించారు. ఉప్పులూరు డొంక రోడ్డు నుంచి స్టేషన్ వరకూ ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేపట్టారు. విజయవాడ-‌ మచిలీపట్నం ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులతో కలిసి పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంస్కరణల పేరుతో పాలకులు అనుసరిస్తున్న విధానాల‌ కారణంగా పేదలు రోడ్డున పడుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌బిసి విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురే‌ష్‌బాబు విమర్శించారు. పార్లమెంట్ బడ్జె‌ట్ సమావేశాలకు నెల రోజుల ముందుగానే రై‌ల్ చార్జీ‌లు పెంచిన ఘనత సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాని‌దే అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం సర్‌చార్జీలతో పేదలపై భారాన్ని మోపుతుంటే, కేంద్రం తానేమీ తక్కువ కాదంటూ రైల్ చార్జీ‌లు పెంచిందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు సామాన్యుడి నడ్డి విరిచే విధానాలు అమలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే పాలకులు అవసరం లేదని, తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పెంచిన రైలు చార్జీలను ఉపసంహరించుకునే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
Back to Top