కోటీ యాబై రెండు లక్షలు


హైదరాబాద్, 11 జనవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్యా స్పందన వచ్చింది. 'జగన్ కోసం... జనం సంతకం' పేరుతో 2012 డిసెంబర్ 22న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 20 రోజులపాటు కొనసాగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందకు వచ్చి సంతకాలు చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యవేక్షణలో జరిగిన సంతకాల సేకరణ గురువారంతో ముగిసింది. శ్రీ జగన్మోహనరెడ్డిపై సీబీఐ చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణలో 1.52 కోట్ల మంది సంతకాలు చేశారు. మహారాష్ట్రలో పార్టీ నేతలు చేపట్టిన సంతకాలు, అలాగే ఆన్‌లైన్ ద్వారా వచ్చిన సంతకాలను ఇంకా చేర్చాల్సి ఉంది.

     శ్రీ జగన్మోహనరెడ్డిపై సీబీఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, ద్యార్యాప్తు కూడా నిష్పక్షపాతంగా కొనసాగడంలేదంటూ సంతకాల రూపంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పార్టీ నేతలు వివరించనున్నారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేతలు సంతకాల సేకరణ కోసం గ్రామీణ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించారని నిరసన వ్యక్తం చేశారు.

     ''కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారనే కారణంతో శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని గత ఏడు మాసాలుగా జైలులో ఉంచారు. రాజకీయ ఒత్తిళ్లతో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఆ కుట్రలో భాగంగా శ్రీ జగన్మోహనరెడ్డిని నిందితుడిగా చూపాలని సీబీఐ ప్రయత్నిస్తోంది. సీబీఐ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సంస్థ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలి. శ్రీ జగన్మోహనరెడ్డి కేసులో సీబీఐ వ్యవహారిస్తున్నతీరు దారుణమని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని'' రాష్ట్రపతికి పార్టీ విజ్ఞప్తి చేయనుంది.

     టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్, మాయావతి కేసుల్లో ఒక విధంగా శ్రీ జగన్మోహనరెడ్డి కేసులో ఒక విధంగా సీబీఐ వ్యవహరిస్తోందని పార్టీ నేతలు ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. 'జగన్ కోసం... జనం సంతకం' పేరుతో సేకరించిన సంతకాలతోపాటు సాఫ్ట్, హార్డ్ కాపీలను కూడా రాష్ట్రపతికి అందజేయనున్నట్టు పార్టీ కోఆర్డినేటర్ పియన్‌వి ప్రసాద్ తెలిపారు.

Back to Top