బాబు నీ పాపాలకు శిక్ష తప్పదు

దేశచరిత్రలోనే ఇది అతి పెద్ద కుంభకోణం
రాజధాని ముసుగులో బాబు, ఆయన బినామీలు..
లక్షల కోట్లు కాజేశారు
రాష్ట్రంలో సర్వ అనర్ధాలకు బాబే కారణం
విచారణ అంటే ఉలుకెందుకు బాబు
రాష్ట్రంలో స్కామ్ ల పాలన కొనసాగుతోంది
బాబుకు శిక్ష తప్పదుః కోటంరెడ్డి

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై  నిప్పులు చెరిగారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు చంద్రబాబు  ఇష్టారీతిన పరిపాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో స్కీమ్ ల పాలన గాకుండా స్కామ్ ల పాలన సాగుతోందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని అహంకారంతో ఇప్పుడు విర్రవీగొచ్చేమో గానీ...ఎల్లకాలం మీ ఆటలు సాగవని చంద్రబాబును హెచ్చరించారు. చంద్రబాబు, రాజధాని ముసుగులో మీరు, మీ కుమారుడు, మీ బినామీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసిన పాపానికి విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు. 

రాజధాని భూముల మీద సాక్షి అవాస్తవాలు రాస్తోంది, చర్యలు తీసుకుంటామని చంద్రబాబు మాట్లాడడంపై  కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పత్రికలను ఖబడ్దార్ అంటున్నావ్. ప్రజలకు కావాల్సింది నీ బెదిరింపులు కాదు . రాజధానిలో లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించిన నిజాలు కావాలన్నారు. వార్తలు రాసిన పత్రికలపై చర్యలు తీసుకుంటామంటే ప్రజలు హర్షించరన్నారు. ముందు మీరు, మీ బినామీలు భూదందాపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. అప్పుడు మీరు, మీ కుమారుడు, మంత్రులు కడిగిన ముత్యాలుగా వస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారన్నారు. 

బాబు దేనికైనా సై అని మాట్లాడుతావే. మరి రాజధాని భూముల దందాపై విచారణకు నై అని ఎందుకు అంటున్నావ్ బాబు. విచారణ అంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. సాక్షిలో వచ్చిన వార్తలపై మాత్రమే విచారణ చేయిస్తారా...? లేక  గతంలో ఇసుక దురాక్రమణ, మంత్రి అల్లుడు గిల్లుడు అని వచ్చిన పత్రికలపై చర్యలు తీసుకుంటారా. మంత్రి సుజనాచౌదరి బ్యాంకులను కొల్లగొట్టిన విధానం గురించి జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. దానిపై కూడా చర్యలు తీసుకుంటారా.  మీరు, రేవంత్ రెడ్డి ఓటుకు కోట్లు కేసులో  సూట్ కేసులతో  అడ్డంగా దొరికారు. బ్రీఫ్ డ్ మీ, వాట్ ఐ సే అంటూ టీవీల్లో  , పత్రికల్లో వార్తలు వచ్చాయి. దానిపై కూడా  విచారణ చేయిస్తారా...? అని బాబును కోటంరెడ్డి సూటిగా ప్రశ్నించారు. తప్పించుకోలేని పాపాలు చేసిన చంద్రబాబు శిక్షకు గురికావాల్సిందేనన్నారు. 


బాబు ఆధారాలు కావాలని మాట్లాడుతున్నావే. సాక్షాత్తు రిజిస్టర్ డాక్యుమెంట్లు చూపిస్తుంటే ఇంతకంటే ఏం  ఆధారాలు కావాలని కోటంరెడ్డి ఫైరయ్యారు. అమెరికా, రష్యా డాక్యుమెంట్లు కాదు బాబు.  ఏపీ రిజిస్టర్ కార్యాలయాల్లో మీరు, మీ బినామీలు చేసుకున్న ఎవిడెన్స్ అని ఎత్తిపొడిచారు. నీను నిప్పు, నా కుమారుడు ఉక్కు అంటున్నవే. ఆమాట చెప్పుకోవాల్సింది  మీరు, మేము కాదు బాబు.  విచారణకు ఆదేశించండి. మీరు ఉక్కో, తుక్కో విచారణ సంస్థలే చెబుతాయన్నారు. ఈరోజు కాలయాపన చేసినా ఏదో రోజు మీకు శిక్ష తప్పదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తే....రాజధాని ముసుగులో లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని బాబుపై ధ్వజమెత్తారు. 

అగ్రిగోల్డ్  ఆస్తులు అటాచ్ అయ్యాయని బాబు చెప్పడాన్ని శ్రీధర్ రెడ్డి తప్పుబట్టారు. హాయ్ లాండ్ లో అగ్రిగోల్డ్ ఆస్తుల గురించి మీరు, మీకుమారుడు  మాట్లాడుకోలేదా బాబు. ఆస్తులు అటాచ్ అయితే  మీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పేరుమీద ఆ ఆస్తులను ఎలా కొన్నారు .ఇప్పటికైనా ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాం. చర్యలు, విచారణ పత్రికల మీద కాదు. మీ భూదందా, చేతల మీద చేయించండి. అంతేగానీ  మీరు బెదిరింపులకు దిగితే భయపడే వాళ్లు ఎవరూ లేరని హెచ్చరించారు. 

అసంబ్లీ లో మాట్లాడితే సస్పెండ్ చేయిస్తున్నావ్. బయట మాట్లాడితే అక్రమ కేసులు పెట్టిస్తున్నావ్. ఇది సద్దాం హుస్సేన్ పాలనో, తాలిబాన్ పాలనో కాదు బాబు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.  ఒక సగటు పౌరుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు అని చెప్పారు. రాష్ట్రంలో జరిగే సర్వ అనర్థాలకు బాబే కారణమని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఐఏఎస్, ఐపీఎస్ మీటింగ్ లలో ..రూల్స్ ఉల్లంఘించైనా పార్టీ నాయకుల పనులు చేయాలి, గౌరవమివ్వాలని చెప్పారో, ఆరోజు నుంచే ఐఎఎస్, ఐపీఎస్ లు చేతులు కట్టుకొని కూర్చున్నారన్నారు. దాన్ని అలుసుగా తీసుకొని మీ మంత్రులు, ఎమ్మెల్యేలు భూదోపిడీకి పాల్పడ్డారన్నారు. 

మాట్లాడితే సీనియర్  అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు...ఇలాంటి దుందుడుకు వైఖరి కట్టిబెట్టాలన్నారు. కనికట్టు విద్యలు, మోసపు మాటలకు స్వస్థి పలకాలన్నారు. చిత్తశుద్ధి, నిజాయితీ, ధైర్యం ఉంటే రా విచారణకు ఆదేశించు అని ఛాలెంజ్ చేశారు. రాజధానిలో  రైతుల భూములు జోన్ 1,2 అయిన గ్రీన్ జోన్ లో పడేసి...జోన్ 3 లో మాత్రం  మీ కుమారుడు, మీ బినామీలు, మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని భూములు కొన్నారు.  తరతరాలుగా నేలతల్లిని నమ్ముకొని బతుకున్న రైతులను మోసగించారు. ఇదెలా సాధ్యమైందో, ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుంటుందన్నారు. 

ఏడాదికి వేయి కోట్లు కాదు ఐదేళ్లలో ఐదు కోట్లని నారాయణ మాట్లాడుతున్నాడు. నీవు అప్పుడు ఎక్కడ ఉన్నావు నారాయణ,  ల్యాప్ ట్యాప్ అంటావే దాంట్లో చదువుకో మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అంటూ ఎధ్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వం కాపులకు చేసిందేమీ లేదన్నారు. ముద్రగడ  ఆమరణదీక్ష చేస్తే రూ. 500 కోట్లు అని చెప్పి రూ. 100కోట్లు ప్రకటించారని ఫైరయ్యారు.  నారాయణ ముందు మీ బావమరిది బినామీల బాగోతం బయటపెట్టు. రాసిస్తానంటున్నవ్ . ఏ భూములు రాసస్తావో ముందుకురావాలని డిమాండ్ చేశారు.  అంతేగానీ  నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు. 

భూములు రాసిస్తామంటున్నచంద్రబాబు ..ఎవరి భూములు రాసిస్తారని ప్రశ్నించారు. మీ వేముల రవికుమార్ భూములు రాసిస్తారా, మంత్రి నారాయణ తొలి బావమరిది సాంబశివరావు, రెండో బావమరిది మునిశంకర్, ప్రమీల భూములు రాసిస్తారా. లేక పయ్యావుల కేశవ్, విక్రమసింహవి రాసిస్తారా. మురళీమోహన్, రావెల కిషోర్, ప్రత్తిపాటి, లింగమనేని ఎస్టేట్ ఆస్తులు ఇస్తావా. ఇంత పెద్ద  లక్షల కోట్ల కుంభకోణం దేశచరిత్రలో ఎక్కడా జరగలేదు. విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు. ఎందుకంత భయం, ఉలికిపాటు, బాబు మీ చిదంబర రహస్యమేంటో చెప్పాలని ఎద్దేవా చేశారు. 
Back to Top