రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొద్దాం

  • 2019లో వైయస్‌ జగన్‌ సీఎం అవడం తథ్యం
  • ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్న సర్కార్‌
  • నా జీతం, దాతల సహాయంతో రూరల్‌ల్లో అభివృద్ధి చేశా
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా ప్లీనరీలో కోటంరెడ్డి
నెల్లూరు: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారన్నది అంతే నిజమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి గౌతంరెడ్డి, నాయకులు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీ సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి మోకాలొడ్డుతుందన్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలను అధికారులకు, మంత్రులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమస్యలను ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతంతో, దాతల సహాయంతో కుల మతాలకు అతీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా శ్మశానవాటికలు, వాటర్‌ ట్యాంక్‌లు, డంపింగ్‌ యార్డులు, బస్టాండ్‌లు, విద్యుత్‌ మరమ్మతులు, వృధాశ్రమాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టానన్నారు. 

కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటా..
ఎమ్మెల్యేగా ప్రజలు ఆశించదానికంటే ఎక్కువే చేశానన్న సంతోషం ఉంది కానీ, పార్టీని, తనను నమ్మి అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలకు ఏ మేలు చేయలేకపోయాననే అసంతృప్తి ఉందని కోటంరెడ్డి అన్నారు. 2019 తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఇంకా ఒకటిన్నర సంవత్సర కాలం మాత్రమే మిగిలుందన్నారు. రాజకీయ ఎన్నికలంటే పోలింగ్‌ పూర్తయ్యే వరకు కాదు.. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఆత్మవిశ్వాసంతో కదం.. కదం.. తొక్కుతూ, పదం పదం పాడుతూ.. పిడికిలి బిగించి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డ వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకొని రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
Back to Top