కోతల ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి: షర్మిల

మహబూబ్‌నగర్‌::: ప్రజల సౌకర్యాలన్నింటికీ కోతలు పెడుతున్న దుర్మార్గపు ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఇది కోతల ప్రభుత్వం.. జనం సమస్యలు పట్లించుకోదని ఆమె దుయ్యబట్టారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే‌ మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలన్నింటినీ తిరిగి మీ దరికి చేరుస్తారు. అందుకు నేను భరో సా ఇస్తున్నా..’ అని శ్రీమతి షర్మిల అభయమిచ్చారు.

'మీ నాన్న కాదు...! మా నాన్నే!'
‘ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్నారు. ఆయన మేలును ఇప్పటికీ మరిచిపోలేం.. ఆయన మీ నాన్న కాదమ్మా.. మా నాన్న’ అని తిరుపతమ్మ అనే మహిళ శ్రీమతి షర్మిల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఈ ప్రభుత్వం బియ్యం, కిరోసిన్, గ్యా‌స్ ఇలా అన్నింటా కోత పెడు‌తోంది. ఇలాగైతే ప్రజలు ఎలా బతకాలమ్మా’ అంటూ మరో మహిళ తన గోడును వెళ్లబోసుకుంది. మాకు ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తారట.. మరి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇళ్లలో ఎన్ని సిలిండర్లు ఉన్నాయో చెప్పగలరా?’ అంటూ మరికొందరు శ్రీమతి షర్మిల ముందు ప్రభుత్వాన్ని నిలదీశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సోమవారం దేవరకద్ర నుంచి యాత్ర ప్రారంభించి ధర్మాపూర్ వరకు కొనసాగించారు.‌

పిల్లలను బడి మాన్పించవద్దు:
పాదయాత్ర సందర్భంగా ఓబ్లాయపల్లిలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల మహిళలు, రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 'మనసు లేని రాక్షస ప్రభుత్వం కనీసం ఉపాధి పనులు కూడా చూపకపోవడంతో కుటుంబ జీవనం కోసం చాలా మంది తమ పిల్లలను పాఠశాలలకు పంపకుండా కూలి పనులకు తీసుకెళ్తున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పిల్లలను కూలికి తీసుకెళ్లకుండా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు. ‘పిల్లలను బడి మాన్పించకుండా మనసు రాయి చేసుకొని కష్టపడి ఆర్నెల్లు స్కూలుకు పంపించండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత మీ పిల్లలను చదివించే బాధ్యత ఆయనే తీసుకుంటారు. మన పిల్లలను చదివించకపోతే వారు కూడా కూలీలుగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదవించాలని విజ్ఞప్తి చేస్తున్నా..’ అని శ్రీమతి షర్మిల మహిళలను కోరారు.

సమస్య చెబుదామంటే.. మెడపట్టి గెంటేస్తున్నారు:
సమస్యలు చెప్పుకుందామని వెళితే సమాధానం చెప్పే వాళ్లు లేక ఆఫీసుల్లో మెడపట్టి గంటేస్తున్నారన్నాని కొందరు ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ముందు వాపోయారు. మహిళలందరినీ వైయస్ తన సొంత తోబుట్టువులా చూసుకున్నారని షర్మిల గుర్తుచేశారు. ‘వడ్డీలేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. మాకేమో రూ. 2 నుంచి రూ.3 వరకు వడ్డీ పడుతోంది’ అని సుగుణమ్మ అనే మహిళ వాపోయింది.
 
తనకు 20 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం ఎనిమిది కిలోలు మాత్రమే ఇస్తున్నారని, ఇల్లు మంజూరైందని ఉన్న గుడిసెను తొలగిస్తే ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయిందని, ప్రస్తుతం తాము చలికి గజగజ వణుకుతూ బయట పడుకోవాల్సి వస్తున్నదని అమ్మణ్ణి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను ఆశీర్వదిస్తే ఏ గ్రామంలోనూ గుడిసె లేకుండా చేసి ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.
 
జగనన్నను ఆశీర్వదించండి:
జగనన్నను ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు పిల్లల చదువు కోసం 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున ఇద్దరికి నెలకు రూ.1000, ఇంటర్‌ మీడియట్‌లో ఒక్కో విద్యార్థికి రూ.700 చొప్పున, డిగ్రీలో ఒక్కో విద్యార్థి కి రూ.1000 చొప్పున ఇద్దరికి ప్రతినెలా వారి తల్లుల ఖాతాలో జమచేసే విధంగా విద్యా ప్రణాళిక రూపొందించారన్నారు. డిగ్రీ తర్వాత ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు చెప్పారు.‌
Back to Top