కూరగాయల ధరలపై శాసనసభలో చర్చిస్తాం

హైదరాబాద్, 11 జూన్‌ 2013:

ప్రజలెవ్వరూ కూరగాయలు కొనలేనంతగా ధరలు మండిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేశారు. కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలపై తాము శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుపడతామన్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన కూరగాయల ధరలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జి. శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి కృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి. గుర్నాథరెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ ఎర్రగడ్డ రైతుబజా‌ర్‌ను మంగళవారం సందర్శించారు.

రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించే వారిని, కొనుగోలుదారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్‌‌లోని ధరలను వారు పరిశీలించారు. రైతుబజార్‌లో విక్రయిస్తున్న సరకుల ధరల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పర్సుల్లో డబ్బులు తీసుకెళ్ళి.. సంచుల్లో కూరగాయలు తెచ్చుకునేవారని, ఇప్పుడు సంచులతో డబ్బులు తెచ్చినా.. సరిపడా కూరగాయలు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top