సీఎం కిరణ్‌ చరిత్రహీనుడవుతారు : కొణతాల

‌విశాఖపట్నం :

ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోడానికే కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదం ముసుగులో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. విశాఖ‌పట్నం విమానాశ్రయంలో ఆయన ఆదివారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియను సజావుగా నడిపించడానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వత్తాసు పలుకుతూ ఆమె ఒక అస్త్రంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. విభజన పక్రియ సజావుగా సాగిపోవడానికి ప్రజాప్రతినిధులతో రాజీనామాలు ఇవ్వనీయకుండా, రాజకీయ సంక్షోభం రానీయకుండా సీఎం అడ్డుపడుతున్నారన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభలో తీర్మానానికి కిరణ్ ‌ప్రభుత్వం ప్రయత్నించడంలేదని కొణతాల తీవ్రంగా ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రం ముందుకు వెళుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా తాపీగా కూర్చున్నారని విమర్శించారు. సోనియాను ఎదిరిస్తుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ త్యాగం చేస్తారని చాలా మంది భావించారని, కానీ ఇపుడు ఆయన నిజ స్వరూపం బయటపడిందని చెప్పారు. సమైక్యవాదాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగులుతారన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేసే పరిస్థితి లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని సోనియా గాంధీ నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యసభ సభ్యత్వానికి నందమూరి హరికృష్ణ, మంత్రి విశ్వరూప్ చేసిన రాజీనామా‌లను ఆమోదించినా, మిగతా మంత్రుల రాజీనామాలు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఆమోదించకపోవడం దారుణం అని కొణతాల విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చిత్తశుద్ధితో ముందుకు నడిపిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మసి పూయాలని చూస్తున్నారన్నారు. రాజీనామాలపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు.

చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర ముసుగులో ఒకలా.. ముసుగు తీసి మరొకలా వ్యవహరిస్తున్నారని కొణతాల విమర్శించారు. సేవియర్ ఆ‌ఫ్ కాంగ్రె‌స్ (రక్షకుడు)గా చంద్రబాబు‌ నాయుడు మారారని ఎద్దేవా చేశారు. సోనియా నేతృత్వంలో చంద్రబాబు, కిరణ్ కుమా‌ర్‌ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తనపై సీబీఐ కేసులు లేకుండా, సమైక్యాంధ్రకు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సీఎం కాకూడదన్న దుర్బుద్ధితోనే కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని కొణతాల ఆరోపించారు.

Back to Top