కొండ్రపోల్‌ శిబిరంలో షర్మిల రక్తదానం

కొండ్రపోల్‌ (నల్గొండ జిల్లా) : సుదీర్ఘ పాదయాత్ర బడలికను పక్కన పెట్టి రాజన్న కూతురు, జగనన్న సోదరి శ్రీమతి షర్మిల రక్తదానం చేశారు. మరో ప్రజాప్రస్థానం 1,000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా కొండ్రపోల్ వద్ద సోమవారం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు, అభిమానులు రె‌డ్‌క్రాస్ సంస్థకు రక్తదానం చేశారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై‌.వి. సుబ్బారెడ్డి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో సాగిన ఈ శిబిరంలో‌ శ్రీమతి షర్మిల స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. సుమారు 400 మిల్లీ లీటర్ల రక్తాన్ని ఆమె ఇచ్చారు. శ్రీమతి షర్మిల స్ఫూర్తితో దాదాపు 65 మంది తమ రక్తాన్ని దానం చేశారు. రక్తదానం చేసిన తర్వాత కూడా శ్రీమతి షర్మిల మరో 4.5 కిలో మీటర్ల దూరం నడిచి రాత్రికి బస ఏర్పాటు చేసిన దామరచర్ల శివారు ప్రాంతానికి చేరుకున్నారు.

మహిళలకు చీరల పంపిణీ :
శ్రీమతి షర్మిల 1,000 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకు‌లు, తుడా మాజీ చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదానం అనంతరం శ్రీమతి షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైయస్‌ఆర్ విగ్రహం వద్దే ఇ‌ల్లు కట్టుకుంటా: సూర్యానాయక్
‘‌మహానేత డాక్టర్‌ వైయ‌స్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రైతుల ముఖంలో నవ్వుండేది. ఇప్పుడది లేదు. ఆయన తనయ శ్రీమతి షర్మిల పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు మా భూమి దగ్గరే పూర్తి కావడం మా అదృష్టం. మా కొడుకు ఒకరు పైలట్. మరో కొడుకు సా‌ఫ్టువేర్ ఇంజనీ‌ర్. చదువు పూర్తయ్యాక కొడుకు అమెరికా వెళ్లినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడూ అంతే సంతోషం వేస్తోంది. వై‌యస్‌ఆర్ విగ్రహం వెనకాలే ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు వై‌యస్‌ఆర్ నా ఇంటి ముందే ఉంటాడు’ అని మహానేత విగ్రహం ఏర్పాటు కోసం తన భూమిని ఇచ్చిన గిరిజన రైతు సూర్యానాయక్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.‌ మహానేత వైయస్‌ఆర్ విగ్రహం ‌ఏర్పాటు చేసేందుకు భూమిని ఇచ్చిన సూర్యానాయక్ దంపతులకు‌ శ్రీమతి షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు.
Back to Top